రుణయాప్ నిర్వాహకుల ఖాతాలకు సంబంధించి భారీ మొత్తంలో సొమ్మును పోలీసులు స్తంభింపజేశారు. బాధితుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసి వాటిని వివిధ ఖాతాల ద్వారా చైనాకు తరలిస్తున్నట్లు తేల్చారు. బెంగళూరు, హైదరాబాద్, దిల్లీలోని స్థానికులను ఉద్యోగులుగా నియమించుకుని కంపెనీలు ప్రారంభించినట్లు గుర్తించారు. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ కంపెనీలను చైనీయులు తమ వెబ్ సైట్లకు అనుసంధానం చేసుకున్నట్లు వెల్లడించారు. రుణ యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని హవాలా మార్గంలో హాంగ్ కాంగ్, చైనాకు తరలిస్తున్నట్లు తెలిపారు.
రుణాలు ఇవ్వటానికి చైనీయులు ఎక్కడి నుంచి నిధులు సమీకరించారనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 25 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చారనే కోణంలో పరిశీలిస్తున్నారు. మొదట సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు ఇచ్చి వివిధ రూపాల్లో డిపాజిట్లు స్వీకరించిన తర్వాత యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.