కంచె చేనుమేసిందన్నచందంగా... సీజ్చేసిన నగదులో అవకతవకలకు పాల్పడ్డారు పోలీసులు. విషయం బయటకు పొక్కడంతో అడ్డంగా బుక్కయ్యారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెస్ట్‌జోన్ మంగళ్‌హాట్ ఠాణాలో జరిగింది.
ఇదీ జరిగింది
హైదరాబాద్ వెస్ట్‌జోన్‌లోని మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో గతంలో ఓ పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు రూ. 16లక్షల 80వేలుకు పైగా నగదును సీజ్ చేశారు. అయితే దొరికిన నగదులో పోలీసులు చేతివాటం చూపించి రూ. 4లక్షల 12 వేలు మాత్రమే దొరికినట్లు చూపించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో నిధుల గోల్‌మాల్‌పై సీపీ అంజనీకుమార్ ఎస్బీ విచారణకు ఆదేశించారు. విచారణలో మంగళ్‌హాట్ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ మురళీ... పోలీస్ కానిస్టేబుళ్లు కిరణ్, ఈమనెల్, రవిని 90 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ నెల 1న సీపీ చర్యలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఇదీ చూడండి:Theft: యజమాని తాళం మర్చిపోయాడు.. పనిమనిషి 24 లక్షలు నొక్కేసింది.!