Fake Covid Reports gang arrested in hyderabad: కొవిడ్ నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్ తప్పుడు ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సినేషన్ పత్రాలను విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్‌కు పంపించి నెగిటివ్ రిపోర్టులు తయారుచేస్తున్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకోకపోయినా వేయించుకున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 65 ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్లు, 20 నకిలీ శాంపిల్స్, 1 సెల్‌ఫోన్, 50 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ జి.చక్రవర్తి.. మీడియా సమావేశంలో వెల్లడించారు.
పైసలిస్తే నెగిటివ్ సర్టిఫికెట్
మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ 2012లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్‌లోని పలు ల్యాబ్‌లలో పనిచేశాడు. ఏడాది క్రితం మలక్ పేట్లో హోం కేర్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించాడు. గత రెండు నెలలుగా కొవిడ్ పరీక్షలు చేయించుకునే వాళ్ల సంఖ్య పెరగడంతో ఇళ్ల వద్దకు వెళ్లి నమూనాలు తీసుకొని మెడిసిస్ పాథ్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించి రిపోర్టులు ఇస్తున్నాడు. విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధరణ పరీక్షలు తప్పనిసరి కావడంతో.. నెగిటివ్ సర్టిఫికెట్ కావాలనుకునే వాళ్ల నుంచి రూ. 3 వేల వరకు తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చాడు.