Drugs Addicted Students Arrest: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న మూడు ముఠాలను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. డార్క్‌నెట్‌లో నిఘా పెట్టిన నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్.. డ్రగ్స్ వ్యవహారాన్ని బయట పెట్టిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారని సీపీ తెలిపారు. విద్యార్థులకు ఇదివరకు మానవీయ కోణంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకుండా మళ్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారని.. అందుకే విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్నామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. నిందితుల్లో యువతులు కూడా ఉన్నారని చెప్పారు.
విక్రయదారుల్లో వారే అధికం
డార్క్‌నెట్ ద్వారా వినియోగదారులు డ్రగ్స్ తెప్పిచుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు గుర్తించామని.. వీటిని పోస్టు, కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారని తెలిపారు. పట్టుబడిన ముఠాలో నైజీరియన్ ఉన్నాడని.. ఆ దేశస్థులు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. వీసా గడువు తీరినా ఇక్కడే ఉంటున్నారని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు కార్పొరేట్ కంపెనీలో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ విద్యాలయాల్లో కొంత మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయా యూనివర్శిటీల దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.