Hyderabad Drug Case: హాష్ ఆయిల్ కేసులో కీలక వ్యక్తి లక్ష్మీపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరికి చెందిన లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. హాష్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు... ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను నార్కోటిక్ విభాగం పోలీసులు సేకరిస్తున్నారు. మాదకద్రవ్యాలకు బానిసై ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. బీటెక్ విద్యార్థికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ప్రేమ్ ఉపాద్యాయ్తో పాటు ముగ్గురు వినియోగదారులను వారం క్రితం అరెస్ట్ చేశారు.
Hyderabad Drug Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ - హైదరాబాద్ డ్రగ్స్ కేసు
15:06 April 05
హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
ప్రేమ్ ఉపాద్యాయ్‌కు హాష్ ఆయిల్‌ను లక్ష్మీపతి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. వైజాగ్, విజయవాడ, బెంగళూర్, గోవాకు బృందాలుగా వెళ్లి గాలించారు. లక్ష్మీపతి బీటెక్ చదువుతున్న సమయంలో గంజాయికి బానిసయ్యాడు. ఆ తర్వాత గంజాయి విక్రయించడం మొదలు పెట్టాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు హాష్ ఆయిల్ సరఫరా చేయడం ప్రారంభించారు. దాదాపు 100 మంది వరకు లక్ష్మీపతి నుంచి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐసో ఫ్రొఫైల్ ఆల్కహాల్లో గంజాయి మొగ్గలను మరిగించి దాని ద్వారా వచ్చే ద్రావణాన్ని లక్ష్మీపతి విక్రయిస్తున్నాడు. లీటర్ హాష్ ఆయిల్‌ను 6 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నాడు. 10మి.లీటర్లను చిన్న సీసాలో నింపి వాటిని వినియోగదారులకు చేరవేస్తున్నాడు. మాదాపూర్, కొండాపూర్, నార్సింగ్ ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని... అక్కడ పార్టీలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వాట్సాప్, స్నాప్ చార్ట్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రాం, వీ-చాట్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని లక్ష్మీపతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపతి హాష్ ఆయిల్, ప్రేమ్ ఉపాద్యాయ్ ఎల్ఎస్డీ, ఎక్టసీ టాబ్లెట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించేందుకు నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సంబంధిత కథనాలు:డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు.. లక్ష్మీపతి నెట్‌వర్క్‌పై ఆరా.!