Supplies Drugs Gang Arrested: మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా.. కొత్త ఎత్తులతో మత్తు ముఠాలు తమ ఆగడాలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా డ్రగ్స్‌ను ధోతీ బాక్సుల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన మరువక ముందే.. ఇదే తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మట్టి గాజులను దండలుగా చేసి.. వాటి మాటున డ్రగ్స్‌ను తరలిస్తుండగా గుర్తించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు.. కేటుగాళ్లను పట్టుకుని, కటకటాల్లోకి నెట్టారు.
చిన్న ప్యాకెట్ల రూపంలో..:చెన్నైకి చెందిన ఖాదర్ మొహిదీన్, ఇబ్రహీం షా.. తెరవెనుక ఉండే కొందరి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాలను ప్యాకెట్లుగా చేసి విదేశాలకు పంపుతుంటారు. విమానాశ్రయాల్లో తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కిలోల కొద్ది సూడో ఎఫిడ్రిన్‌ను చిన్న ప్యాకెట్లుగా మార్చుతుంటారు. తనిఖీల్లో గుర్తించలేని విధంగా పొట్లాలను చీరలు, గాజులు, ఫొటో ఫ్రేముల్లో భద్రపర్చి ప్రైవేట్ వాహనాల ద్వారా.. హైదరాబాద్‌కు తీసుకు వస్తుంటారు.
అధిక మొత్తంలో నగదును ఆశ చూపి..: అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా సరకు పంపిస్తే కస్టమ్స్ అధికారులు గుర్తిస్తారని.. స్థానిక కొరియర్ సంస్థలకు అధిక మొత్తంలో నగదును ఆశ చూపి, వారి ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సరకును చేరవేస్తూ వస్తున్నారు. తనిఖీల్లో సరుకు పట్టుబడినా.. తమ వివరాలు బయటపడకుండా స్మగ్లర్లు జాగ్రత్తపడుతున్నారు. బేగంపేటలోని ఓ కొరియర్ సంస్థ నుంచి మాదకద్రవ్యాలు విదేశాలకు చేరుతున్నట్లు ఉత్తర మండలం పోలీసులకు అందిన సమాచారంతో హెచ్ న్యూ పోలీసులతో కలసి కూపీలాగితే డొంక కదిలింది.
గాజులను పరిశీలించగా..:కొరియర్‌లో పంపుతున్న గాజులను పరిశీలించగా.. బరువులో వచ్చిన అనుమానంతో బయటికి తీయగా దందా బయట పడింది. సాధారణ మట్టి గాజుల మధ్యలో సూడో ఎఫిడ్రిన్ నింపిన ప్యాకెట్లను ఉంచి.. గాజులను దండగా మార్చి, ఇరువైపు మూతలు బిగించారు. ఇక్కడ లభించిన ఆధారాలతో 3.1 కిలోల సూడో ఎఫిడ్రిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఖాదర్ మెహిదీన్, ఇబ్రహీంషాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి సహకరిస్తున్న నగరానికి చెందిన కొరియర్ సంస్థల నిర్వాహకులను గుర్తించారు.