Cyber Cheater Arrested: ఆధునిక యుగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్ చేయడం.. స్నేహితులతో చాటింగ్ చేయడం.. తమ అభిప్రాయాలను పంచుకోవడం.. మొదలైనవి ఈ రోజుల్లో చాలా కామన్. అయితే ఈక్రమంలో కొంతమంది అమ్మాయిలు తమకు తెలియని వ్యక్తులతో సైతం పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. ఈ బంధాలు చివరికి వివిధ నేరాలకు, ఘోరాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.
తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను పరిచయం చేసుకొని బెదిరింపులకు దిగుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మనోజ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అశ్లీల వెబ్‌సైట్‌లలో నీలిచిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డాడు. దీంతో మనోజ్ యువతులపై కన్నేశాడు.
సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. పలువురు యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. ఈ క్రమంలో ఓ మైనర్ బాలిక అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. ఇన్‌స్టాగ్రామ్ ఎలా హ్యాక్ చేయాలనే విషయాన్ని అంతర్జాలం చూసి నేర్చుకున్న మనోజ్.. మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లింకు పంపాడు. లింకును ఓపెన్ చేసిన సదరు మైనర్ బాలిక.. అందులో అడిగిన వివరాలు నమోదు చేసుకుంటూ వెళ్లింది.