ఆ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకున్న వారే సైబర్ నేరగాళ్ల లక్ష్యం... జాగ్రత్త! ‘పరిశోధన సంస్థలు... కార్పొరేట్ సంస్థలు... విదేశాల్లోనూ ఉద్యోగాలున్నాయి... పదిరోజుల క్రితం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్... అరబిందో ఫార్మా కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు, సెంటిస్టులుగా కొందరిని చేర్పించాం...మమ్మల్ని సంప్రదించండి...’ అంటూ ఇంజినీరింగ్ పూర్తైన విద్యార్థులు... పరిశోధకులుగా మారేందుకు జాబ్ పోర్టళ్లలో నమోదు చేసుకున్న వారికి సైబర్ నేరస్థులు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు.
కొవిడ్ మహ్మమారి కారణంగా రోగనిరోధక శక్తిని పెంచేమందులు, వ్యాక్సిన్లు తయారు చేస్తున్న పరిశోధన సంస్థలు, ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసినవారి కొత్త ఉద్యోగాలున్నాయంటూ నమ్మిస్తున్నారు. బహుళజాతి సంస్థల్లో అవకాశాలంటూ బాధితులను నమ్మించి రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. రెండునెలల్లో 46 మంది మోసపోయారు.
బహుళజాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముఖ్యంగా టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు అభ్యర్థుల నుంచి నేరుగా డబ్బు చెల్లించాలంటూ అభ్యర్థించబోవని వివరిస్తున్నారు. దిల్లీ, నోయిడాల్లో ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయని వీటిపై నిఘా ఉంచామని తెలిపారు.
కెనడాలో ఉద్యోగం.. 4.80లక్షలు నగదు బదిలీ..
సికింద్రాబాద్‌లో ఉంటున్న వేణు కుమార్ కొద్దిరోజుల క్రితం నౌకరీ డాట్‌కాంలో ఒక ప్రకటన చూశాడు. కెనడాలోని ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ఆ ప్రకటనలో ఉంది. వెంటనే అతడు అందులోని నంబర్‌కు ఫోన్ చేయగా... గాబ్రియల్ జోనాస్ అనే వ్యక్తి మాట్లాడాడు. ముంబయిలో ఉంటున్న క్రిస్‌ల్యాండ్ అనే వ్యక్తి మీకు వీసా కోసం సహాయం చేస్తాడని వివరించాడు. ప్రతిభ ఉన్నవారికి వెంటనే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. వీసా రుసుం కోసం రూ.25వేలు కట్టాలని వివరించగా.. వేణు ఆ మొత్తాన్ని చెల్లించాడు.
మూడు నెలల జీతం ధరావతుగా రూ.1.50 లక్షలు పంపించాలని క్రిస్‌ల్యాండ్ వివరించాడు. వేర్వేరు కారణాలతో మొత్తం రూ.4.80లక్షల నగదును వేణు వారికి బదిలీ చేశాడు. ఇంటర్నెట్ ద్వారా పరీక్ష ఉంటుందని చెప్పిన క్రిస్‌ల్యాండ్ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. వరుసగా ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో మోసపోయనని గ్రహించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అరబిందోలో శాస్త్రవేత్త.. ఫోన్‌లోనే ఇంటర్వ్యూ..
వేమన యోగ పరిశోధన సంస్థలో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్‌ను అరబిందో సంస్థలో ఉన్నతాధికారిగా ఉద్యోగం ఇస్తామంటూ ఇద్దరు మహిళలు జ్యోతి, పల్లవిలు మోసం చేశారు. సంవత్సరానికి రూ.40లక్షల వేతనం ఇప్పిస్తామని చెప్పారు. ఫోన్‌లోనూ పల్లవి ఇంటర్వ్యూ చేసి కంపెనీలో చేరేందుకు అవసరమైన రుసుములు ఇవ్వాలంటూ ఆయన వద్ద నుంచి రూ.1.56లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. పల్లవి అనే మహిళ అరబిందో సంస్థలో ఉన్నతోద్యోగంలో ఉండడంతో శాస్త్రవేత్త ప్రసాద్ నిజమేనని నమ్మి రూ.1.56లక్షలు నగదు బదిలీ చేశారు.
మాన్‌స్టర్.. నౌకరీ.. షైన్...
నౌకరీ డాట్‌కాం, షైన్, మాన్‌స్టర్, క్వికర్ డాట్‌కాం వెబ్‌సైట్లలో తమ అర్హతలను నమోదు చేసుకుంటున్న ఉద్యోగార్థుల వివరాలను సైబర్ నేరస్థులు సేకరిస్తున్నారు. అనంతరం వారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ రుసుం రూ.2వేల నుంచి రూ.4వేల వరకూ చెల్లించాలని వివరిస్తున్నారు. నిరుద్యోగులు నగదు బదిలీ చేయగానే.. రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వసూలు చేసుకున్నాక సంప్రదింపులు నిలిపేస్తున్నారు. సైబర్ నేరస్థులు నౌకరీడాట్‌కాం.. షైన్, మాన్‌స్టర్ క్వికర్ నుంచి మాట్లాడుతున్నామంటూ చెబుతుండడంతో ఉద్యోగార్థులు నిజమేనని నమ్ముతున్నారు. నగదు బదిలీ చేస్తున్నారు.
ఇదీ చదవండి :వీళ్ల హోలీ కొంచెం వెరైటీ... రంగులతో పాటు దెబ్బలూ తినాలి!