INSURANCE FRAUD: బీమా చేయిస్తామంటూ ముగ్గురు ఘరానా నిందితులు హైదరాబాద్‌లో నివాసముంటున్న డెబ్భైనాలుగేళ్ల విశ్రాంత ప్రభుత్వ అధికారి కె.జగపతిరావును మోసం చేశారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న నిందితులు అధికలాభాలొస్తాయంటూ.. వేరువేరు జీవిత బీమా పాలసీల పేరుతో రెండేళ్లలో ఆయన నుంచి రూ.4.94 కోట్లు కాజేశారు. లండన్‌లో ఉంటున్న జగపతిరావు కుమారులకు బ్యాంక్ ఖాతాలలో నగదు నిల్వలు తగ్గడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా... బీమా విషయం వివరించారు.
కుమారుల సూచనతో ఆయన కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులు పుల్లేటి సుబ్రహ్మణ్యం, ఉడుతా మనోజ్‌కుమార్, బండారి మహేశ్‌గౌడ్‌లను అరెస్టు చేశామని ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి తెలిపారు. జగపతిరావు నుంచి రూ.4.94కోట్లు కాజేసిన నిందితులు కేవలం రూ.30లక్షల పాలసీలు మాత్రమే చేయించారని వివరించారు.
హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో విశ్రాంత ప్రభుత్వాధికారి జగపతిరావు, ఆయన భార్య నివాసముంటున్నారు. వీరి కుమారులు ఉన్నతవిద్యకోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ నగరం వచ్చి చూసి వెళ్తుండేవారు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, భారతీ యాక్సాలైఫ్ ఏజెంట్ ఉడుతా మనోజ్‌కుమార్‌లు స్నేహితులు. వీరు కొన్నేళ్ల నుంచి వేరువేరుగా పాలసీలు చేయిస్తున్నారు. వీరి స్నేహితుడు బండారి మహేశ్‌గౌడ్ మరో ప్రైవేటు కంపెనీలో బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.