కుటుంబ తగాదాలు.. అతణ్ని విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి.. అతనిలో ఆవేశాన్ని పెంచాయి. రోజూలాగే.. ఆరోజు కూడా భార్యతో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో.. విచక్షణ కోల్పోయి ఆమెపై విరుచుకుపడ్డాడు. బ్లేడు(MURDER ATTEMPT)తో ఆమె గొంతు కోశాడు. ఏం చేస్తున్నాడో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్న అతను.. అదే ఆవేశంలో అడ్డొచ్చిన కుమారుడిపైనా దాడి చేశాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ తల్లీకొడుకులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.
వరంగల్‌లో భర్త చేతిలో దాడికి గురైన భార్య, ఆమె కుమారుడు...... ఎంజీఎం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కాకతీయకాలనీకి చెందిన చిన్నా..... కుటుంబ తగాదాలతో విచక్షణ కోల్పోయి భార్య, కుమారుడి గొంతు కోశాడు. ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న చిన్నాకు.. భార్య శోభారాణి, ఇద్దరు పిల్లలు చందన, జయవర్దన్ ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా శోభతో గొడవపడిన చిన్నా.. ఆవేశంలో .. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. శోభ కేకలు పెట్టడంతో మరో గదిలో నిద్రిస్తున్న పిల్లలు బయటకు వచ్చారు.
విచక్షణ కోల్పోయిన చిన్నా.... కుమారుడి గొంతు కూడా కోశాడు. భయాందోళనకు గురైన కూతురు... బయటకు పరుగెత్తి స్థానికులకు చెప్పింది. వారు వచ్చి చూసేసరికి చిన్నా కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు వెంటనే వారిని ఎంజీఎం ఆసుత్రికి తరలించారు. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.