నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు నలభై శాతం కాలిన గాయాలతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
నిజామాబాద్ జిల్లా ఎర్గట్లా గ్రామానికి చెందిన శ్రావణికి సోన్ మండల కేంద్రానికి చెందిన సతీశ్‌తో 2014లో వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. కొద్దిరోజుల తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య శ్రావణితో పాటు ఇద్దరు కుమారులపై సతీశ్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తల్లి ఇద్దరు కుమారులను పక్కకు నెట్టేయడంతో పిల్లలు తప్పించుకున్నారు. శ్రావణి అరుపులతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి వేసి పోలీసులకు సమాచారం అందించారు.