వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప హన్మాపూర్ గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు. తన భర్తను గ్రామ సర్పంచ్ అనుచరులు కర్రలు, రాళ్లు, గొడ్డలితో దాడి చేసి హత్య చేశారని వాణిశ్రీ వెల్లడించారు. ఇసుక వివాదంపై మాట్లాడుకుందామని పిలిచి.. తన భర్తను చంపేశారని ఆరోపించారు. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని ఆమె వాపోయింది.
మాట్లాడుకుందామని..
'గ్రామంలో వీరప్ప కొత్త ఇల్లు కట్టాడు. ఆదివారం అందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో రాత్రి గొడవ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లగా పరిస్థితి సర్దుమణిగింది. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ వద్ద మాట్లాడుకుందామని ప్రత్యర్థులు వీరప్పని పిలిపించారు. అక్కడే మాటకు మాట పెరిగి అతనిపై మూకుమ్మడిగా దాడికి దిగారు' అని వాణిశ్రీ తెలిపింది. తీవ్రంగా గాయపడిన అతణ్ని.. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.