భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. తాను చేసిన కిరాతకాన్ని మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కప్పిపెట్టేందుకు మహమ్మారి కరోనా కూడా తనకు తోడైంది. అనుమానంతో భార్యను చంపేసి... కరోనాతో మరణించిందని అందరిని నమ్మించాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరినీ దగ్గరికి రాకుండా జాగ్రత్తపడి.. నిజం ఎక్కడా బయటపడకుండా అంత్యక్రియలు సైతం జరిపించాడు. అంతా అయిపోయిందనుకునే సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చిన అనుమానంతో అసలు విషయం బయటపడింది.
CRIME: అనుమానంతో చంపి.. కరోనాను వాడుకుని.. చివరికి... - vanasthalipuram latest crime news
12:31 July 03
వనస్థలిపురంలో భార్య హత్య కేసులో భర్త అరెస్టు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగ్రామంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన రమావత్ విజయ్ నాయక్.. నల్లగొండ జిల్లా పిల్లగుంట్ల తండాకు చెందిన కవితను వివాహమాడాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించే విజయ్... పెళ్లి తర్వాత వనస్థలిపురంలోని వైదేహీనగర్లో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భార్యను అపురూపంగా చూసుకున్నాడు. భార్య అందంగా ఉంటుందని మురిసిపోయే అతని ఆనందం కాస్తా... రానురాను అభద్రతాభావంగా రూపాంతరం చెందింది. అది కాస్తా.. అనుమానపు విత్తును నాటింది. భార్య ఎవరితో ముచ్చటించినా... ఫోన్లో మాట్లాడినా... అనుమానించటం మొదలుపెట్టాడు.
కరోనా వచ్చిందని నమ్మించి...
తన అందమే తనకు యమపాశమవుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. తన సౌందర్యమైన రూపాన్ని చూసి వరించిన మొగుడే... తనపాలిట యముడవుతాడని ఆ వివాహిత అంచనా వేసి ఉండదు. విజయ్‌లో చిన్నగా మొదలైన అనుమానం పెనుభూతమైంది. తనలో ఉన్న భర్తను... కిరాతకునిగా మార్చేసింది. భార్యను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్నా విజయ్... పథకం రచించాడు. జూన్ 18న భార్య పడుకున్న సమయంలో దిండుతో గాలాడకుండా చేసి హతమార్చాడు. ఈ నేరం బయటకురాకుండా చేయాలని విజయ్ మరో ఎత్తు వేశాడు. కవితకు కరోనా వచ్చిందని... పరిస్థితి విషమించి చనిపోయిందని... ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. తన ఆటోలోనే కవిత మృతదేహాన్ని.. పిల్లగుంట్ల తండాకు తీసుకెళ్లాడు. కరోనా బారిన పడే కవిత చనిపోయిందని అందరినీ నమ్మించాడు విజయ్. అంత్యక్రియలు చేసే సమయంలోనూ... ఎవరూ దగ్గరికి రావొద్దని, వస్తే వారికి కూడా అంటుకుంటుందని భయపెట్టాడు. అప్పటికీ కొందరు సాయం చేసి... అంత్యక్రియలు జరిపారు. "హమ్మయ్యా... అంతా అనుకున్నట్టే.. అయిపోయింది. నా మీద ఎవరికి అనుమానం రాలేదు. దీని నుంచి నేను బయటపడ్డట్టే.." అని విజయ్ రిలాక్స్ అయ్యాడు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది.
నెగెటివ్ పరీక్షలతోనే అనుమానం...
అంత్యక్రియల్లో పాల్గొన్న కవిత తరఫు బంధువులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆరు రోజుల తర్వాత అందరికీ నెగెటివ్‌గా తేలింది. కవిత తల్లిదండ్రులకు అసలు అనుమానం అప్పుడు మొదలైంది. వెంటనే వనస్థలిపురం ఆస్పత్రిలో కవితకు చేయించిన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్టులపై ఆరా తీశారు. అవి నకిలీవని తెలటంతో... నేరుగా పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా పోలీసుల ముందుంచారు.
పోస్ట్‌మార్టంతో వెలుగులోకి నిజం..
రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. నేరుగా పిల్లగుంట్ల తండాకు వెళ్లారు. అక్కడి ఎమ్మార్వోతో మాట్లాడి.. పాతిపెట్టిన మృతదేహాన్ని.. మళ్లీ తవ్వి తీసేందుకు అనుమతి తీసుకున్నారు. కవిత మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అక్కడి నుంచి పోస్టుమార్టానికి పంపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో... కవిత మరణానికి కరోనాతో సంబంధం లేదని తేలింది. మెడ మీద గాయాలున్నాయని... ఊపిరాడకుండానే చనిపోయినట్టు తేలటంతో... విజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తమదైనశైలిలో విజయ్‌ని పోలీసులు ప్రశ్నించగా... అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టుకు తరలించి రిమాండ్‌కు తీసుకున్నారు.