అన్ని విషయాల్లో ఇతర మెట్రో నగరాలతో పోటీ పడే హైదరాబాద్ డ్రగ్స్ సంస్కృతిలోనూ వాటి సరసనే నిలుస్తోంది. పారిశ్రామికవాడలు, శివారు ప్రాంతాలు దాటి ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న పర్యాటక ప్రాంతాలూ కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యార్థులు, మైనర్లు పెడ్లర్లుగా మారి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల్ని తరలిస్తున్నారు. తరచూ పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నా.. కేసులు నమోదు చేస్తున్నా బాహాటంగానే దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఎప్పటికప్పుడు కొత్త సరకు!
నగరంలో సాగుతోన్న ఈ నల్ల మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త సరకు కోసం వెంపర్లాడుతున్నారు మత్తుబాబులు. చెట్ల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కొటిక్ ఉత్పత్తులు, ల్యాబుల్లో తయారయ్యే ఉత్పత్తులు, గంజాయి, నల్లమందు, కొకైన్‌లతోపాటు గంజాయితో తయారు చేసే చెరస్, హషీష్ ఆయిల్, బంగ్, నల్లమందుతో చేసే బ్రౌన్ షుగర్, హెరాయిన్.. ఇవన్నీ నార్కొటిక్స్ కిందకే వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్ లాంటివి సైకోట్రోపిక్స్ కిందికి వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో గంజాయి ప్రతి గల్లీలో, నగర శివారుల్లో, పర్యాటక కేంద్రాల్లో గుప్పుమంటోంది.
- బంగ్ ఒక్కో మాత్ర రూ.100, బ్రౌన్ షుగర్ గ్రాము రూ.15 వేలకు అమ్ముతున్నారు.
- వీటి ధరలు సాధారణ రోజుల్లో ఇలా ఉండగా లాక్‌డౌన్ కాలంలో మత్తుబాబుల బలహీనతను సొమ్ము చేసుకున్నారు వ్యాపారులు. గ్రాము కొకైన్ విలువ రూ.5 వేల-రూ.15 వేలకు పెంచి అమ్మారంటే దందా ఎంత పెద్దఎత్తున సాగిందో ఊహించుకోవచ్చు.
- 2019లో 215 మంది పట్టుబడగా వీరిలో 214 మంది స్థానికులు, ఓ విదేశీయుడు ఉన్నారు.
- 2020లో 213 మంది పట్టుబడగా వీరిలో 212 మంది స్థానికులు, ఓ విదేశీయుడు ఉన్నారు.