తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs: శంషాబాద్​ డ్రగ్స్ కేసులో సూత్రధారి ఎవరు..? - huge amount of drugs caught in telangana

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో రికార్డు స్థాయిలో మత్తుమందులు స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు తెరవెనుక సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనట్లు రూ.78 కోట్లు విలువైన 12కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరు మహిళా కొరియర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉండే ఉత్తర భారత దేశానికి తరలించేందుకు కొరియర్ల ద్వారా హెరాయిన్​ను హైదరాబాద్‌కు తెచ్చినట్లు డీఆర్‌ఐ అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

drugs, drugs caught in Hyderabad, heroin caught in Hyderabad
హెరాయిన్ పట్టివేత, హైదరాబాద్​లో హెరాయిన్ పట్టివేత, హైదరాబాద్​లో డ్రగ్స్ పట్టివేత

By

Published : Jun 7, 2021, 11:46 AM IST

హైదరాబాద్‌ మత్తు పదార్థాలు సేవించే వారి కోసం బెంగుళూరు, గోవా, దిల్లీ, ముంబయిల నుంచి నైజీరియన్ల ముఠాలతో పాటు స్థానిక ముఠాలు కూడా డ్రగ్స్​ను సరఫరా చేయడం సాధారణం. అది కూడా తక్కువ మోతాదులో.. ఎండీఎంఏ, ఎపిడ్రిన్‌, హెరాయిన్‌ లాంటి మాదకద్రవ్యాలు గుట్టు చప్పుడు కాకుండా వాడకందార్లకు సరఫరా అవుతుంటాయి. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు, డీఆర్‌ఐ అధికారులు, నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులకు.. పక్కా సమాచారం వస్తే తప్ప సరఫరాదారులు దొరకరు. శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఎక్కువగా గ్రాముల్లోనే దొరికే డ్రగ్స్.. ఆదివారం దశాబ్దకాలంలో ఎప్పుడూ దొరకనంతగా.. ఏకంగా రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ దొరికింది. ఇంత పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడటం ఇదే మొదటిసారి అని డీఆర్​ఐ అధికారులు తెలిపారు.

ఎక్కువగా ఉత్తర భారత్​లోనే..

నిఘా సంస్థల కళ్లుగప్పి ఆఫ్రికన్‌ దేశాల నుంచి భారత్‌కు తరచూ మత్తు పదార్థాలు సరఫరా అవుతుంటాయి. బయట దేశాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే డ్రగ్స్ హైదరాబాద్‌ మినహా ఇతర నగరాల్లోనే తరచూ పట్టుబడుతుంటాయి. ఏప్రిల్‌ 22న తమిళనాడులోని తుటికోరిన్‌ పోర్టులో రెండువేల కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. గత నెల 7న బెంగుళూరు, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో ఏకంగా 25 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీలో గత నెల 14న రూ.275 కోట్లు విలువైన 54 కిలోల హెరాయిన్​ను దిల్లీ పోలీసులు పట్టుకున్నారు.

ప్లాన్ ప్రకారమే...

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో పట్టుబడిన ఇద్దరు ఆఫ్రికన్‌ మహిళల్లో ఒకరు జాంబియాకు చెందిన ముకాంబ కరోల్‌ కాగా మరొకరు ఉగాండాకు చెందిన బ్రెండా. వీరిద్దరిలో ముకాంబ కరోల్‌ జింబాంబ్వే, జోహాన్నెస్‌బర్గ్‌, దోహల మీదుగా ఈ నెల రెండో తేదీన హైదరాబాద్‌ వచ్చింది. అమెతో పాటు లగేజి రాకపోవడంతో.. శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో మూడు రోజులపాటు బస్ చేసింది. కరోల్‌ తన లగేజిని తీసుకోడానికి ఈ నెల 5వ తేదీన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వెళ్లగా.. అప్పటికే టిప్ అందిన డీఆర్​ఐ అదికారులు ఆమె లగేజీని తనిఖీ చేశారు. కరోల్ బ్యాగ్​లో హెరాయిన్​ను గుర్తించారు. తూకం వేయగా 4 కిలోలు ఉన్నట్లు తేలింది. ఉగాండాకు చెందిన బ్రెండా కూడా కరోల్‌ మాదిరిగానే జింబాంబ్వే, జోహాన్నెస్‌బర్గ్‌, దోహల మీదుగా హైదరాబాద్‌ వస్తుండడంతో అనుమానం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు బ్రెండా చేరుకోగానే అనుమానంతో ఆమె లగేజి కూడా తనిఖీ చేశారు. బ్రెండా వద్ద 8 కిలోల హెరాయిన్​ను గుర్తించారు.

అసలు సూత్రధారి కోసం ఆరా..

మత్తుపదార్థాలు ఉత్తర భారత్​కు తీసుకెళ్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటీవల ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై ఎయిర్​పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడటం వల్ల శంషాబాద్ సేఫ్ అనుకుని ఈ కొరియర్లను పంపినట్లు డీఆర్​ఐ అధికారులు భావిస్తున్నారు. వీరి అరెస్టుపై ఆయా దేశాల విదేశాంగ శాఖలకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీనివెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనేది అధికారులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details