తెలంగాణ

telangana

ETV Bharat / crime

Honey Trap: మసాజ్​ పేరుతో వలపు వల.. ఆ తర్వాత వీడియోలతో బెదిరిస్తూ...

హైదరాబాద్ నగరంలో వలపు వల దందా రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు వెళ్లే మర్దన కేంద్రాలే ఇందుకు వేదికలవుతున్నాయి. వీటిల్లో విదేశీ యువతులతో అనైతిక కార్యకలాపాలు సాగిస్తూ... పైగా వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. దిల్లీ, కోల్‌కతా ముఠాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Honey Trap from massage centers, cyber crime from massage centers in hyderabad
మసాజ్ కేంద్రాల్లో వలపు వల, సంపన్న వర్గాల యువకులపై హనీ ట్రాప్

By

Published : Aug 7, 2021, 9:40 AM IST

Updated : Aug 7, 2021, 12:26 PM IST

వ్యాపారులు... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.. సంపన్న కుటుంబాలకు చెందిన యువకులను లక్ష్యంగా చేసుకుని నగరంలో వలపు వల (HONEY TRAP) దందా పెచ్చుమీరుతోంది. మర్దన కేంద్రాలు (SPA, massage centers) ఇందుకు వేదికలవుతున్నాయి. పోలీసులకు దొరక్కుండా ఇక్కడ అనైతిక కార్యకలాపాలు సాగిపోతున్నాయి. యువకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఉక్రెయిన్, రష్యా, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌లకు చెందిన యువతులను భారీ పారితోషికంతో రప్పిస్తున్నారు. బాలీవుడ్‌లోని జూనియర్‌ నటీమణులు, కోల్‌కతా, దిల్లీ, ముంబయి నగరాల్లోని సెక్స్‌ వర్కర్లనూ పిలిపిస్తున్నారు. తాజాగా నగరంలోని ఓ స్పాలో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడడంతో ఈ వ్యవహారం మరోసారి బయటకు వచ్చింది.

మూడు నెలల్లో 60 మంది

దీనిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించగా మూడు నెలల్లో 60మంది యువతులు వచ్చినట్టు గుర్తించారు. దిల్లీ.. కోల్‌కతాల్లో ఉంటున్న రెండు ముఠాలు ఈ రాకెట్‌ వెనుక ఉన్నాయని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. విదేశాలు.. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించే అందమైన యువతులు నగరానికి చేరాక వారికి ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసి హైదరాబాద్, సైబరాబాద్‌లలోని స్పాలు, మసాజ్‌ సెంటర్లకు పంపుతున్నారు. విటులు కోరితే... రిసార్టుల్లోనూ వారికి వసతి కల్పిస్తున్నారు. వీటితోపాటు పోలీసులు తనిఖీలకు రాని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ ఖరీదైన అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. సంపన్న యువకుల నుంచి రూ.లక్షలు తీసుకుని విదేశీ యువతులతో గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

వ్యాపారి కుమారుడి నుంచి రూ.15 లక్షలు

వివిధ రకాల యాప్‌ల ద్వారా స్పాలకు రావాలంటూ యువకులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను ఆహ్వానిస్తున్నారు. సంపన్నులని తెలియగానే.. విదేశీ యువతులకు వారి గురించి వివరిస్తున్నారు. రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీయాలని చెబుతున్నారు. రహస్యంగా చిత్రీకరించిన అనంతరం వారికి ఆ ఫొటోలు, వీడియోలు పంపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.లక్షల్లో గుంజుతున్నారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఓ వ్యాపారి కుమారుడిని ఓ స్పా నిర్వాహకులు రెండు నెలల క్రితం బెదిరించి రూ.15లక్షలు తీసుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చి ఫిర్యాదు చేయాలంటూ సూచించగా.. వారు తమకేమీ కేసు వద్దంటూ చెప్పారు. గతంలో మాదాపూర్‌లో రెయిన్‌ పేరుతో కొనసాగుతున్న స్పాలో సోదాలు నిర్వహించగా... ముగ్గురు విదేశీ యువతులు పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌లోని మరో మసాజ్‌ కేంద్రంలో రష్యా, ఉక్రెయిన్‌ యువతులుండగా.. వారిని దిల్లీలోని రాయబార కార్యాలయాలకు పంపించారు. ‘‘స్పాలు, మసాజ్‌ కేంద్రాల్లో హానీ ట్రాప్‌ వ్యవహారాలు కొనసాగుతున్నా.. ఫిర్యాదులు రావడం లేదు. విదేశీయువతుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం.. అనుమానాస్పదంగా అనిపిస్తే వారి దేశాలకు సమాచారమిస్తున్నాం’’అని ఒక పోలీస్‌ అధికారి ‘ఈటీవీ భారత్‌’కు వివరించారు.

ఇదీ చదవండి:Drugs In Hyderabad: మత్తుమందుల అక్రమ రవాణా.. వయా హైదరాబాద్

Last Updated : Aug 7, 2021, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details