Highway Robbery Gang in guntur: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పరిధిలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి నగదు లాక్కెళ్లుతున్నారు. లింగారావుపాలెం సమీపంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న దంపతుల నుంచి బంగారు నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను యడ్లపాడు ఎస్సై రాంబాబు వెల్లడించారు.
Robbery gang in Guntur: లింగారావుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వీరయ్య, ప్రసన్న దంపతులు. గుంటూరు వెళ్లి సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్నారు. బోయపాలెం నుంచి లింగారావుపాలెం మార్గంలోని చెరువు వద్దకు రాగానే గుర్తుతెలియని యువకులు వారిపై కర్రలతో దాడి చేసి పక్కనే ఉన్న పొలంలోకి వారిని లాక్కెళ్లారు. వీరయ్యను కొట్టి గాయపరిచారు. ప్రసన్న చెవులకు ఉన్న 3.5గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,300ల నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పంపించారు.
Robbery in Guntur: మరికొద్దిసేపటికి అదే మార్గంలో అంకమ్మ, నరసమ్మ దంపతులపైనా దాడి చేసి చెవి కమ్మలు, జుంకాలు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. గొలుసు లాగే క్రమంలో సగం తెగి అంకమ్మ జాకెట్‌లో పడింది. ఆ తర్వాత వారు ప్రాధేయపడటంతో వదిలేశారు. సమాచారం తెలుసుకున్న కాలనీవాసులు.. పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపే దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ రప్పించి తనిఖీలు నిర్వహించారు. ఫింగర్‌ప్రింట్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.