Hash Oil Smuggling : గంజాయి అక్రమ రవాణా నియంత్రించేలా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడంతో స్మగ్లర్లు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. గంజాయి ఆకుల నుంచి హాష్ ఆయిల్ తీసి విక్రయిస్తున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ, ఆంధ్రా-ఒడిషా సరిహద్దు, మాడుగుల ప్రాంతంలో హాష్ ఆయిల్ తయారవుతోంది. వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్న స్మగ్లర్లు.. పొడి గంజాయిని రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడ హాష్ ఆయిల్‌గా మార్చుతున్నారు. యువకులు, కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రైవేటు కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు హాష్ ఆయిల్ కావాలంటూ డిమాండ్ చేస్తుండడంతో... నేరస్థులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కేరళ నుంచి వస్తున్న స్మగ్లర్లకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
Hash Oil Smuggling in Telangana : ఒక కిలో హాష్ ఆయిల్ తయారవ్వాలంటే ఐదుకిలోల గంజాయి అవసరమవుందని పట్టుడిన నేరస్థుల్లో కొందరు పోలీస్ అధికారులకు వివరించారు. మత్తు కోసం మరిన్ని రసాయనాలు కలిపాక ఒక కిలో హాష్ ఆయిల్ తయారీకి లక్ష అవుతుందని... దాన్ని స్మగ్లర్లకు లక్షన్నరకు ఇస్తున్నామని తెలిపారు. వారు ఆరున్నర లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తోంది లక్ష్మీపతి ఒక్కడే కాదని... పదుల సంఖ్యలో లక్ష్మీపతులున్నారని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లోనే హాష్ ఆయిల్ విక్రయిస్తున్న పదిహేను మందిని అరెస్ట్ చేశామని వివరించారు. బోయిన్‌పల్లిలో తాము పట్టుకున్న భవానీ ప్రసాద్ అలియాస్ బిట్టు విశాఖపట్నం నుంచి హాష్ ఆయిల్ తెచ్చుకుంటున్నాడని తెలిపారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మాన్సి, మనేక్, శ్యామ్, బిశ్వాస్‌లు తొలుత హాష్ ఆయిల్ పీల్చేవారని... ఒకటి, రెండేళ్ల నుంచి గంజాయితోపాటు హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారన్నారు.