చిట్ డబ్బులు అడగడంతో సజీవ దహనానికి యత్నించిన ఘటనలో భార్యాభర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అవసరానికి చిట్ పాడుకున్న వ్యక్తి... ఆ డబ్బులు అడిగాడన్న కోపంతో దుకాణానికి నిప్పు పెట్టి... షాపు యజమాని రాజును సజీవ దహనం చేసేందుకు యత్నించిన నిందితురాలు గొడుగు కావ్యతో పాటు ఆమె భర్త గణేష్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయాంత్రం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న శ్రీ సెల్ వరల్డ్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు చెక్కులు బౌన్స్
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడు గొడుగు గణేష్ ఓ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తుంటారు. ఇతడి ద్వారా బాధితుడు రూ.ఐదు లక్షల చిట్ వేశారు. కొద్దిరోజుల తర్వాత బాధితుడు రాజు తన అవసరం కోసం చిట్ పాడుకున్నారని తెలిపారు. ఆ డబ్బు కోసం పలుమార్లు చిట్ ఫండ్ యాజమాన్యాన్ని సంప్రదించడంతో... చివరగా ఆ కంపెనీ మూడు బ్యాంక్ చెక్కులను అందజేసిందని వెల్లడించారు. వాటిలో ఒక చెక్కుకు మాత్రమే కొంత మొత్తం డబ్బు రాగా... మిగతా రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధితుడు రాజు మిగతా చిట్ డబ్బుల గురించి ఏజెంట్ గణేష్‌ను బాధ్యుడిని చేస్తూ పలుమార్లు నిలదీసినట్లు వివరించారు.