smart phones Hacking with Bluetooth: గత కొంతకాలంగా ఇయర్‌ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు అందుబాటులోకి రావడంతో బ్లూటూత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీన్ని సైబర్ నేరగాళ్లు తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. బ్లూటూత్ ఆన్‌లో ఉండే ఫోన్లు లక్ష్యంగా పంజా విసురుతున్నారు. ‘బ్లూ బగ్గింగ్’ పేరిట పిలిచే ఈ హ్యాకింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
బ్లూ బగ్గింగ్ అంటే..?: సాధారణంగా ఫోన్‌కు సందేశాల ద్వారా లింకులు, సాఫ్ట్‌వేర్‌లు జోప్పించి హ్యాక్ చేస్తుంటారు. బ్లూబగ్గింగ్ విధానంలో మాత్రం బ్లూటూత్ ఆన్‌లో ఉన్న ఫోన్లను లక్ష్యంగా చేసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్ ఆన్‌లో ఉన్న ఫోన్లతో బ్లూటూత్ ద్వారా రిక్వెస్ట్ పంపించి అనుసంధానం అవుతారు. తమ బ్లూటూత్ పేరును ఎదుటి వ్యక్తులు వినియోగిస్తున్న ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్ కంపెనీ పేరులా మార్చి కనెక్ట్ అయ్యేందుకు రిక్వెస్ట్ పంపుతారు.
అది మనదే అని మనం ఒకసారి కనెక్ట్ అయితే అంతే. మన ఫోన్‌కు ఎలాంటి సందేశాలు రాకుండా రహస్యంగా కొన్ని రకాల మాల్‌వేర్లను పంపిస్తారు. ఫోన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటారు. మాల్‌వేర్లను పంపించడం ద్వారా కాంటాక్ట్, ఫొటోలు, ఇతర కీలక సమాచారం తస్కరించి బెదిరింపులకు దిగుతారు. విదేశాల్లో ఈ అనైతిక పద్ధతుల్ని విరివిగా వినియోగిస్తున్నారు.