తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుట్కా రవాణా లారీ అపహరణ - medak district news

గుట్కా రవాణా చేస్తున్న లారీని అపహరించిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని వెల్దుర్తి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి... వారి నుంచి నగదును, గుట్కాసంచులను స్వాధీనం చేసుకున్నారు.

Gutka transport lorry stolen at medak district
గుట్కా రవాణా లారీ అపహరణ

By

Published : Mar 31, 2021, 9:10 AM IST

ఈనెల 25న ఆదిలాబాద్‌కు చెందిన తబ్లేస్‌ ఖాలిక్‌... కర్ణాటకలోని బీదర్‌ నుంచి చిన్న లారీలో రూ.9 లక్షల విలువైన గుట్కా పొట్లాలను ఛత్తీస్‌గఢ్​కు తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న బీదర్‌కు చెందిన ఖండేరావు, పండరి, అనిల్‌, ప్రేమ్‌, రాజు లారీని అపహరించేందుకు పథకం రచించారు.

నిర్మానుష్య ప్రాంతంలో ఆపి...

లారీ వెనుకే ఇన్నోవాలో ఫాలో అవుతూ... మెదక్​ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట దాటిన తర్వాత అర్ధరాత్రి వేళ వారి వాహనాన్ని అడ్డుగా పెట్టి అందులో ఉన్న తబ్లేస్‌ ఖాలిక్‌, డ్రైవర్‌ షమీర్‌ అహ్మద్‌ను బెదిరించి కిందకు దించారు. అనంతరం గుట్కా పొట్లాలతో ఉన్న చిన్న లారీని అపహరించి కొద్దిదూరం వెళ్లిన తర్వాత వాటిని మరో వాహనంలోకి మార్చారు. అనంతరం నేరుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి చేరుకుని అందులో కొన్నింటిని బీదర్‌ నుంచి తెచ్చామని చెప్పి ఒకరికి విక్రయించారు.

తనిఖీలు చేసి..

ఈనెల 27న తబ్లేస్‌ ఖాలిక్‌ చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు వినియోగించిన ఇన్నోవా కారుపై నిఘా ఉంచారు. మంగళవారం 44వ జాతీయ రహదారిపై రామంతపూర్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారును గుర్తించి అందులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. గుట్కా పొట్లాలు విక్రయించగా వచ్చిన నగదు రూ.6.50 లక్షలు, మిగిలిన గుట్కా సంచులు, రెండు వాహనాలను వారినుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజు పరారీలో ఉండగా ఖండేరావు, పండరి, అనిల్‌, ప్రేమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు.

ఇదీ చూడండి:చెత్తకుప్పల్లో 800 ఏళ్ల చరిత్ర.. పూర్వ ​వైభవం వచ్చేనా?

ABOUT THE AUTHOR

...view details