నేరాలకు పాల్పడిన నిందితులను వారు భోజనం చేసి పడేసిన ప్లేట్లే పట్టించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పగలు పొలం పనులు, రాత్రిళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న కర్నూలు నేరగాళ్లను పోలీసులు ఈవిధంగానే పట్టుకున్నారు. మేడికొండూరు సామూహిక అత్యాచారం వీరి పనేనని ప్రాథమికంగా తేల్చారు. గుంటూరు రూరల్ జిల్లా పోలీసుల పరిధిలో ఇటీవల యడ్లపాడు, ఫిరంగిపురం మండలాల్లో వరుస దారిదోపిడీలు జరిగాయి. ఇవి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఘటనా ప్రదేశాల్లో నిఘా కెమెరాలు లేకపోయినా నిందితులను పట్టుకోవటానికి పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.
పొలంలో భోజనం తిన్న ప్లేట్లు...
దర్యాప్తులో భాగంగా యడ్లపాడు మండలం కొండవీడు కొండ దిగువన ఓ పొలంలో భోజనం తిన్న ప్లేట్లు కనిపించాయి. వాటిపై వేలిముద్రలు తీస్తే అవి పాత నేరస్థులివిగా తేలాయి. నిందితులెవరో ఒక అంచనాకు వచ్చిన పోలీసులు వారిని పట్టుకోవటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేరుగా నిందితులకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తే వారు తప్పించుకుపోతారని భావించి వారి ఫోన్లకు కాల్స్ చేయలేదు. నేరం జరిగిన ముందు, తర్వాత రోజు ఆ ప్రాంతాల్లోని టవర్లకు 2 వేల 263 కాల్స్ రాగా... వాటిని విశ్లేషించి ఒక నిందితుడిని ట్రేస్ చేశారు. ఆ ఫోన్ నుంచే ఇతర నిందితులకు కాల్స్ వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. నేరాలకు పాల్పడిన తర్వాత కూడా నిందితుల ఫోన్ల సిగ్నళ్లు యడ్లపాడు, ఫిరంగిపురం మండలాల్లోనే వస్తున్నాయి. కానీ పోలీసులకు కనిపించటం లేదు.