హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కార్యాలయంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అధికారుల తొత్తువని తరచూ తక్కువ చేసి మాట్లాడినందుకు కోపంతో కాల్పులు జరిపిన ఘటన అందిరినీ షాక్‌కు గురిచేసింది. సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహ్మద్ సర్దార్‌ఖాన్ పొరుగుసేవల ఉద్యోగి సురేందర్‌పై మూడురౌండ్లు కాల్పులు జరిపాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో నగరం ఉలిక్కిపడింది.
GUN FIRE: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
15:43 July 14
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
నగరంలోని గన్‌ఫౌండ్రీలో గల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రోజువారీగా మధ్యాహ్నం రెండు గంటలకు ఖాతాదారుల సేవలు పూర్తయ్యాయి. బ్యాంకు అధికారులు, సిబ్బంది వారి పనులు చేసుకుంటున్నారు. భద్రతా విధులు నిర్వహిస్తున్న సర్దార్ ఖాన్(54) తనకు కేటాయించిన గదిలో ఉన్నాడు. మధ్యాహ్నం 3.10గంటలకు సురేందర్(58) సర్దార్ ఖాన్ వద్దకు వచ్చాడు. ఏదో విషయమై ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన సర్దార్ ఖాన్ తన వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్ పంప్ షాట్‌గన్‌ను సురేందర్‌పైకి ఎక్కుపెట్టి కాల్చాడు. సురేందర్ తప్పుకోగా వరుసగా మూడు రౌండ్లు కాల్చాడు. రెండు తూటాలు గోడకు తగలగా.. ఒకటి సురేందర్ ఛాతీకింద భాగంలో దూసుకెళ్లింది. రక్తస్రావమవడంతో అక్కడున్న ఉద్యోగులు అతడిని బయటకు తీసుకువచ్చారు. మరికొందరు సర్దార్ ఖాన్‌ను పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సురేందర్‌ను హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అతడికి ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, అతడిపై హత్యాయత్నం, ఆయుధ దుర్వినియోగ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సంయుక్త కమిషనర్ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ‘నువ్వు అధికారుల చెంచా.. ఎప్పుడూ వాళ్ల కాళ్లు నాకుతుంటావ్’ అంటూ సురేందర్ తనను రోజూ అవమానిస్తుండడంతో తట్టుకోలేక కాల్చానంటూ సర్దార్ ఖాన్ పోలీసుల విచారణలో చెప్పాడు.
సైన్యంలో డ్రైవర్‌గా పనిచేసి..
‘‘వరంగల్ జిల్లా మామునూరుకు చెందిన సర్దార్ ఖాన్ సైన్యంలో డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఎనిమిదేళ్లుగా గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ కార్యాలయంలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. గాయపడిన సురేందర్ పాతబస్తీ ఛత్రినాక నివాసి’’ అని అబిడ్స్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు.
ఇదీచూడండి:suhasini arrest: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!