Realtors Murder in Rangareddy District: హైదరాబాద్ శివారు తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మరణించారు. రాఘవేంద్రరెడ్డి వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు వెంటాడి ఛాతీపై కాల్చారు. కుప్పకూలిన ఆయన్ను స్థానికులు వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి పరిశీలించారు. భూ వివాదాల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని వేర్వేరు తుపాకులతో కాల్చినట్టు నిర్ధరణకు వచ్చారు. గురి తప్పకుండా తుపాకీ పేల్చడాన్ని వృత్తిగా ఎంచుకున్నవారే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆగంతకులు ఏ వాహనంలో వచ్చారు? ఎలా వెళ్లిపోయారనే విషయాలను ఆరా తీస్తున్నారు.
కాల్పులకు ముందు గొడవ
Gun firings on Realtors: శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి... కొద్దికాలం క్రితం కర్ణగూడ సమీపంలో వివాదంలో ఉన్న 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. రోజు మాదిరిగానే శ్రీనివాసరెడ్డి ఉదయం 5.15 గంటలకు కారులో ఆ పొలం వద్దకు బయల్దేరారు. రాఘవేంద్రరెడ్డిని కూడా తీసుకెళ్లారు. పొలం సమీపంలో స్థిరాస్తి వ్యాపారి మట్టారెడ్డి ఉన్నాడు. కొద్దికాలంగా శ్రీనివాసరెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం జరుగుతోంది. కాల్పులకు గంట ముందు ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పరస్పరం బెదిరించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి పొలం నుంచి కారెక్కేందుకు బయటకు వస్తుండగా.. అక్కడే కాపుగాచిన ఆగంతకులు తొలుత శ్రీనివాసరెడ్డిపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఉలిక్కిపడిన రాఘవేంద్రరెడ్డి తప్పించుకునేందుకు కారును వేగంగా పోనిస్తుండగా రోడ్డు పక్కనే ఉన్న మట్టిలో ఇరుక్కుపోయింది. దాదాపు అర కిలోమీటరు దూరం వెంటాడిన ఆగంతకులు.. ఆయనపైనా కాల్పులు జరిపారు. ఒక తూటా నుంచి తప్పించుకున్నా రెండో తూటా ఆయన గుండెల్లోకి దూసుకెళ్లింది. చికిత్స అందించినా ప్రాణం నిలవలేదు.
మూడో వ్యక్తి ఉన్నాడా.?
ఘటనాస్థలంలో పోలీసు జాగిలాలు.. అర కిలోమీటరు దూరం వెళ్లి వెనక్కి వచ్చాయి. శ్రీనివాసరెడ్డి కారులో మూడో వ్యక్తి కూడా ఉన్నాడా.. ఆ వ్యక్తి ఏమైనా కాల్పులు జరిపి ఉండొచ్చా అని కూడా అనుమానిస్తున్నట్టు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ఐదు బృందాలు ఏర్పాటుచేసినట్టు... సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
నాలుగు రోజులుగా కాపు కాసి