తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో ఉగ్రకుట్రకు.. పాకిస్తాన్‌ నుంచే గ్రనేడ్లు సరఫరా.. - ఉగ్రకుట్ర కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు

TERRORIST CONSPIRACY FOILED IN HYDERABAD
TERRORIST CONSPIRACY FOILED IN HYDERABAD

By

Published : Oct 4, 2022, 5:27 PM IST

Updated : Oct 4, 2022, 6:37 PM IST

17:23 October 04

హైదరాబాద్​లో ఉగ్రకుట్రకు.. పాకిస్తాన్‌ నుంచే గ్రనేడ్లు సరఫరా..

హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థాలు పాకిస్తాన్‌ నుంచి ఫరాతుల్లా ఘోరి పంపినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు పేలుడు పదార్థాలు వచ్చాయి. అక్కడి నుంచి గత నెల 28న జాహెద్‌కు పేలుడు పదార్థాలు అందినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. బైక్‌పై వెళ్లిన జాహెద్... 4 గ్రనేడ్లు తీసుకొచ్చాడు. ఒక గ్రనేడ్‌ను తనవద్దే ఉంచుకున్న జాహెద్‌... మిగతావి.. 3 గ్రనేడ్‌లను సమీరద్దీన్, మజ్‌హసన్‌లకు అందించాడు.

సమీరుద్దీన్ సెల్‌ఫోన్‌తో ఫరాతుల్లా ఘోరితో జాహెద్ చాటింగ్‌ చేశాడు. 12 ఏళ్లు జైలులో ఉండి తిరిగొచ్చాక ఉగ్ర కార్యకలాపాలకు జాహెద్ పథకం పన్నాడు. పాక్‌లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక రచించాడు. హవాలా ద్వారా 30 లక్షలకుపైగా నగదు నిందితులకు అందించాడు. యువకులకు డబ్బులిచ్చి ఉగ్రవాదం వైపు ప్రేరేపించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు వివరించారు. హైదరాబాద్‌లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతానికి కల్పించడమే నిందితుల లక్ష్యమని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాల ఆదేశాలతో వరుస దాడులతో బీభత్సం సృష్టించేందుకు మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు (39) ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో నగర సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయమే మూసారంబాగ్‌, చంపాపేట, మలక్‌పేట ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అబ్దుల్‌ జాహెద్‌, అక్బర్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సమి (39), మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌(29)లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఉగ్రకోణం వెలుగు చూసింది. జాహెద్‌ నుంచి 2 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.3,91,800 నగదు, 2 సెల్‌ఫోన్లు, సమీయుద్దీన్‌ నుంచి ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం, మాజ్‌ హసన్‌ నుంచి ఒక గ్రనేడ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్‌లు పాకిస్థాన్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు.

ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను అవకాశంగా చేసుకుని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్‌కు పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఇందుకోసం ఇతను వాడుకుంటున్నట్టు భావిస్తున్నారు. హిందూ పండుగలు, భాజపా, ఆర్​ఎస్​ఎస్​ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసేందుకు దసరా పండుగను అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.

నీలిరంగు గ్రనేడ్లతో దాడులతో దాడికి యత్నం: భారీ ఎత్తున పేలుళ్ల కోసం బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేవారు. అవతలి వైపు నుంచి ఇంటర్‌నెట్‌, ఫోన్‌ ద్వారా తయారీపై సూచనలు చేసేవారు. పోలీసు నిఘా పెరగడం, తయారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాడులకు గ్రనేడ్లను వినియోగించాలనుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతో దాడులు చేశారు. ఆ గ్రనేడ్లు చైనాలో తయారైనట్టు బయటపడింది. రెండు నెలల క్రితం అవే గ్రనేడ్లు పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ చేరాయి.

నెల రోజుల క్రితం అక్కడి నుంచి వ్యాన్‌లో గ్రనేడ్లు నిల్వ చేసిన పెట్టెను నగర శివార్లలో జాహెద్‌కు అందినట్టు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా గ్రనేడ్లను భద్రపరిచారు. నిందితుల నుంచి నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లు నీలి రంగులో ఉన్నాయి. చైనాలో తయారయిన ఈ గ్రనేడ్లు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులకు ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 2006లో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓడియన్‌ థియేటర్‌లో జరిగిన దాడి మొదటి సారి గ్రనేడ్‌తో జరిగింది.

పాక్‌ ఆదేశాల కోసం వెయిటింగ్:గ్రనేడ్లు ఎక్కడ విసరాలి, ఎవరిని రంగంలోకి దించాలి. ప్రాణనష్టం కలిగించేందుకు ఉన్న అవకాశాలపై ఉగ్రమూకలు చర్చించుకున్నాయి. పోలీసు నిఘా నుంచి తప్పించుకుని తమ ప్రణాళిక అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాక్‌ నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. వరుస ఘటనలు, పండుగలతో కేంద్ర నిఘా వర్గాలు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. పాత నేరస్తులు, అనుమానితుల పై నిఘా ఉంచిన సిట్‌, సీసీఎస్​, స్పెషల్ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు... దాడుల గురించి తెలవడంతో అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రహస్యంగా ఆపరేషన్‌ చేసి జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ ఫారూక్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 4, 2022, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details