తెలంగాణ

telangana

ETV Bharat / crime

కారుతో ఢీకొట్టి... కత్తితో మెడ కోసి... - కారుతో ఢీకొట్టి... కత్తితో మెడ కోసి...

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థిక లావాదేవీలే అందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్లు అంచనాకు వచ్చారు.

government teacher murdered in mahaboobnagar
government teacher murdered in mahaboobnagar

By

Published : Mar 12, 2021, 7:42 AM IST

మహబూబ్‌నగర్‌ వైష్ణోదేవి కాలనీలో ఉండే నరహరి (40) చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్‌లో జీహెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నరహరికి రాజేంద్రనగర్‌లో ఉండే జగదీశ్‌ అలియాస్‌ జగన్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. జగదీశ్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని మంథని. పదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. వారి పరిచయం ఆర్థిక లావాదేవీలకు కారణమైంది. ఈ క్రమంలోనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు నరహరి స్థిరాస్తి వ్యాపారం కోసం జగదీశ్‌కు ఇచ్చారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని రెండు నెలల నుంచి నరహరి ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయింత్రం 6 గంటలకు జగదీశ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ వారి మధ్య రాత్రి 12 గంటల వరకు వాదోపవాదాలు జరిగాయి. త్వరలోనే డబ్బులు ఇస్తానని, లేకపోతే బాలానగర్‌లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని జగదీశ్‌ హామీ ఇవ్వడంతో, సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని చెప్పి నరహరి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలు దేరారు. ఆయన వాహనాన్ని భగీరథ కాలనీ సమీపంలో రోడ్డుపై చీకటి ప్రాంతంలో ఓ కారు ఢీకొంది. కిందపడిన నరహరి గొంతుపై పదునైన ఆయుధంతో కోయడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

కారు నంబరు సహాయంతో..

అర్ధరాత్రి నెత్తుటి మడుగులో ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు రోడ్డు ప్రమాదం అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామీణ ఠాణా ఎస్సై రవిప్రకాశ్‌ నేతృత్వంలో పోలీసులు వచ్చి పరిశీలించగా గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న కారు నంబరు ఆధారంగా ఆరాతీయగా జగదీశ్‌దని తేలింది. అనంతరం వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. నరహరి భార్య అరుణకుమారి సైతం జగదీశే తన భర్తను హత్య చేశాడని ఆరోపించారు. జగదీశ్‌కు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నరహరి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో ఒకరే పాల్గొన్నారా.. లేక ఎక్కువ మంది ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు అధికారులు నాలుగు బృందాలను నియమించారు.

ఇదీ చూడండి: భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details