అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం భారీఎత్తున పోలీసులు షాహినాయత్‌గంజ్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇంటికి వెళ్లే దారిలోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో మానస బ్యారక్‌లో రాజాసింగ్‌ను ఉంచారు. ఇవాళ లేదా రేపు మరో బ్యారక్‌కు మార్చే అవకాశం ఉందని జైలు అధికారులు వెల్లడించారు. రాజాసింగ్ బ్యారక్ వద్ద నలుగురు జైలు సిబ్బందితో పహారా కాస్తున్నట్లు వివరించారు.
రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 22న ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని మీడియాకు తెలిపారని పేర్కొన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని.. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని సీపీ తెలిపారు. వ్యాపార సముదాయాలూ మూతపడ్డాయన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.