తెలంగాణ

telangana

ETV Bharat / crime

తపాలా శాఖ ఉద్యోగి ఘరానా మోసం.. విచారణ జరుగుతుండగానే గుండెపోటుతో మృతి

Post office employee fraud: వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే... కష్టపడితే కానీ పూట గడవని బతుకులే... కానీ భార్యాబిడ్డలను బాగా చూసుకోవాలని ఆశపడ్డారు. తమ కష్టం పిల్లలు పడకూడదని తాపత్రయపడ్డారు. భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవడానికి తపాలా శాఖ పథకాల్లో పొదుపు చేసుకుంటున్నారు. కానీ నమ్మిన మనిషే మోసం చేస్తాడని పసిగట్టలేకపోయారు. తమ ఆశలు ఆడియాసలవుతాయని ఊహించలేకపోయారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న అధికారులు.. విచారణ జరుపుతుండగానే ఆ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలాగైనా తమ డబ్బులు తమకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.

post office employee fraud
పోస్టాఫీస్​ ఉద్యోగి మోసం

By

Published : Feb 26, 2022, 1:41 PM IST

Post office employee fraud: కష్టపడి చెమడోడ్చి పనిచేశారు... పైపాపైసా కూడబెట్టారు. భవిష్యత్తు అవసరాల కోసం తపాలా శాఖలో పొదుపు చేశారు. కానీ అక్కడ ఓ ఉద్యోగి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దెబ్బ మీద దెబ్బ పడినట్లుగా.. ఆ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందడం.. బాధితులను ఇంకా ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా గోపాలపట్నంలో వెలుగుచూసింది.

post office employee fraud: ఎలమంచిలి ప్రాంతానికి చెందిన ఎస్.కె. వల్లీ.. గోపాలపట్నం శివారు ఎల్లపువానిపాలెం తపాలాశాఖలో జీడీఎస్​​గా పదిహేడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తపాలా పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించేవారు. చాలామంది రూ.25 వేల నుంచి రూ.16 లక్షల వరకు తమ ఖాతాల్లో పొదుపు చేశారు. ప్రతి నెలా నిర్ణీత సమయంలో ఖాతాదారులు జమ చేసే సొమ్మును, ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసిన సొమ్మును తపాలాశాఖ ఖాతాకు కాకుండా తన సొంత ఖాతాకు మళ్లించాడు.

మోసం బయటపడిందిలా...

post office employee fraud: ఎల్లపువానిపాలెం రజకవీధికి చెందిన కొండవలస రాము... గతంలోనే రూ.6 లక్షల ఫిక్స్​డ్ ​ డిపాజిట్ చేశారు. పథకం కాలపరిమితి ముగియడంతో శుక్రవారం నగదు తీసుకునేందుకు పోస్టాఫీసుకు వెళ్లారు. విధుల్లోకి వచ్చిన కొత్త ఉద్యోగి.. రాము పాస్ పుసక్తం పరిశీలించి నకిలీదిగా తేల్చారు. కంగుతిన్న బాధితుడు లబోదిబోమంటూ ఇంటికెళ్లి.. ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో ఖాతాదారులు 60 మంది తపాలా కార్యాలయానికి వెళ్లి పుస్తకాలు తనిఖీ చేయించుకున్నారు. అవన్నీ నకిలీవని తేలడంతో బాధితులు నిర్ఘాంతపోయారు. దాదాపు రూ.1.5 కోట్ల సొమ్మును సదరు ఉద్యోగి స్వాహా చేసినట్లు బాధితులు గుర్తించారు. ఈ మేరకు బాధితులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

"గవర్నమెంట్​ పథకమని నమ్మి డిపాజిట్​ చేశాం. చాలా మోసపోయాం. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయమంటున్నారు. మాకు ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు.?"-బాధితులు, గోపాలపట్నం

మరో రూ.20 లక్షల మాయంపై విచారణ

post office employee fraud: కొందరు ఖాతాదారులు తపాలాశాఖలో జమ చేసిన సుమారు రూ.20 లక్షల నగదుకు సంబంధించి వల్లీ అవకతవకలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అంశంపై విచారణ కొనసాగుతుండగానే.. వల్లీ ఈనెల 1వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వస్తుందనే భయంతోనే గుండెపోటు వచ్చి మృతి చెంది ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ కలిపినట్టు రసీదులు, పుస్తకాలపై స్టాంపులు వేసేవాడు. ఎంతో కాలం నుంచి పని చేస్తున్న ఉద్యోగి కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. వల్లీ మృతిచెందడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఇంతవరకూ కట్టిన డబ్బులు చేతికి వస్తాయో రావో అని భయపడుతున్నారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

తపాలా శాఖ ఉద్యోగి ఘరానా మోసం

ఇదీ చదవండి:land grabbing: తప్పుడు పత్రాలతో ఇంటి స్థలానికి ఎసరు.. చివరకి ఏమైందంటే

ABOUT THE AUTHOR

...view details