"ప్రతినెలా వెయ్యి రూపాయలు కట్టండి.. పదమూడు నెలల కాల వ్యవధిలో ఏదొక లక్కీ గిఫ్ట్ పొందండి. ఏ బహుమతి తగలకపోతే కాలపరిమితి పూర్తయిన తర్వాత మీ సొమ్ము వాపసు ఇస్తాము." ఇలాంటి ప్రకటన కనిపించిన వెంటనే మధ్యతరగతి కుటుంబాలు సులువుగా బుట్టలో పడిపోతున్నారు. ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఇలా అయినా ఏదొక వస్తువు వస్తుంది కదా అనే చిన్న ఆశతో స్కీములో చేరిపోతుంటారు. ఇదే అదనుగా మోసగాళ్లు వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా పట్టణంలో స్కీముల పేరుతో (scheme scam) మోసపోయామని బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
లక్కీ స్కీము పేరుతో వేల రూపాయలు కట్టి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో గుడ్లక్కీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల వెయ్యి రూపాయలు చెల్లిస్తే లక్కీ డ్రాలో రకరకాల వస్తువులు ఇస్తామని ప్రకటనలు గుప్పించి ఏజెంట్ల ద్వారా సొమ్ము వసూలు చేసి.. కొన్ని నెలలు పాటు సజావుగా నిర్వహించి ఆఖరిలో బోర్డు తిప్పేశారని బాధితులు వాపోతున్నారు.
పట్టాగొలుసు వచ్చిందన్నాడు.. పత్తా లేకుండా పోయాడు
గుడ్లక్కీ ఎంటర్ప్రైజెస్ స్కీములో నెల నెల వెయ్యి రూపాయలు చొప్పున కట్టినా.. నాకు పట్టా గొలుసులు, నా బిడ్డకు కమ్మలు వచ్చాయని మా ఏజెంటు చెప్పాడు. సర్లే తెచ్చి ఇమ్మంటే రేపిస్తా మాపిస్తానంటూ నెట్టుకొచ్చాడు. ఇప్పుడేమే ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మేము కట్టిన సొమ్ము తిరిగిచ్చేయాలి - బాధితురాలు
ఇలా కాజేశారు..
కామారెడ్డి జిల్లా కేంద్రంగా గుడ్లక్కీ ఎంటర్ప్రైజెస్ పేరిట రెండేళ్ల క్రితం సంస్థను ఏర్పాటు చేశారు. మెదక్, హవేళీ ఘనపూర్ మండలాల్లోని అవుసులపల్లి, చౌట్లపల్లి, రాజిపేట, బూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన సుమారు వంద మందికిపైగా ఈ స్కీమ్‌లో సభ్యులుగా చేరారు. 13 నెలల కాల వ్యవధితో లక్కీ డ్రా స్కీము ఏర్పాటు చేసి సొమ్ము వసూలు చేశారు. స్కీములో సొమ్ము కట్టిన కొందరికి బైక్‌లు, పట్టగొలుసులు, ఫ్రిజ్‌లు ఇచ్చారు. అయితే అందరికీ బహుమతులు రాలేదు. ఈలోగా కాలపరిమితి పూర్తయింది. మిగిలిన బాధితులంతా తాము కట్టిన సొమ్ము ఇచ్చేయాలని సంస్థమీద పడ్డారు.