గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అందులో పనిచేసే వ్యక్తే చోరీకి పాల్పడి ఉంటారని అతడిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
gold robbery in bank : పనిచేసే బ్యాంక్‌కే కన్నం.. రూ.2 కోట్లు విలువైన బంగారం మాయం - ap news updates
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వారి గురించి మనకు తెలుసు. కానీ.. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో వ్యక్తి. బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. బ్యాంక్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ రాజు.. బంగారు ఆభరణాలతో ఉడాయించినట్లు తేలింది. ఖాతాదారులు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఆభరణాలను రాజు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2 కోట్ల రూపాయలు ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆభరణాలు రికవరీ చేస్తారని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు.