భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స కోసం తరలించిన మహిళ మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయమైన సంఘటన జరిగింది. ఇదేంటని మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో అలాంటిదేమి జరగలేదని బుకాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన లలిత అనే మహిళకు గుండెపోటు రావడంతో హుటాహుటిన జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని అప్పగించే సమయంలో మహిళపై బంగారు ఆభరణాలు లేవని కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.
'ఆసుపత్రికి వచ్చే సమయంలో ఆమె మెడలో రెండు పుస్తెలు,రెండుగుండ్లు ఉన్నాయి. కంపెనీ నుంచే కొంచెం అస్వస్థతగా ఉందంటే నేరుగా ఆసుపత్రికి వచ్చాం. రాగానే లోపలికి తీసుకెళ్లి నీ వెంట ఎవరైనా వారసులు వచ్చారా అని అడిగారు. ఎవరు రాలేదని చెప్పా... నీ బిడ్డను కొద్దిసేపట్లో గాంధీకి తీసుకెళ్లకపోతే ప్రమాదం ఉంది అన్నారు. ఆమెకు చిన్న పిల్లగాడు ఉన్నాడు. మృతదేహన్ని అప్పగించే ముందు చూస్తే మెడలో ఉన్న అభరణాలు లేవు. అడిగితే అలాంటివి ఏమిలేవు అని దబాయించారు.'-మృతురాలి బంధువు