స్నేహితులుగా పరిచయమయ్యారు. ప్రేమికులుగా మారారు. ఒకరికొకరు ప్రాణంగా బతికారు. పక్కపక్కన ఊళ్లు.. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జన్మజన్మలపాటు ఒకరికొకరు తోడుండాలని బాసలు చేసుకున్నారు. నాలుగేళ్లు.. రెప్పపాటులో అయిపోయాయి. ఇక వివాహ బంధంతో ఒక్కటవుదామనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అని అడిగిన అమ్మాయి ఆ అబ్బాయి సమాధానంతో షాక్‌కు గురైంది. ఇంతకాలం తాను లేకపోతే బతకలేనన్నవాడు.. ఇక నుంచి తన ముఖం చూపించొద్దని పొమ్మన్నాడు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు.. అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల వీరి ప్రేమ బంధం.. శారీరకంగా ఒక్కటయ్యే వరకు వెళ్లింది. ఇక పెళ్లిపీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. ఆ యువకుడు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. నాలుగేళ్ల పాటు తనే లోకంగా బతికిన యువకుడు.. తనను పెళ్లి చేసుకోననేసరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది.
తనను ఎలాగైనా దక్కించుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వేణు, అతని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. పోలీసులు చెప్పినా సరే వేణు వినలేదు. చేసుకోనని స్పష్టం చేశాడు. ఏం చేయాలో పాలుపోని యువతి.. వేణు ఇంటి ఎదుట దీక్షకు కూర్చుంది. అతడి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా అక్కణ్నుంచి పంపేందుకు ప్రయత్నించగా శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి యువతికి నచ్చజెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్దామని అంబులెన్స్‌కు కాల్ చేశారు. తీరా అంబులెన్స్ వచ్చాక.. ఆ అమ్మాయి అక్కణ్నుంచి కదల్లేదు. దీక్షను అలాగే కొనసాగిస్తోంది. వేణు పెళ్లికి అంగీకరించే వరకు అక్కణ్నుంచి కదలలని తెగేసి చెప్పింది.
ఇంతకీ ఏమైందంటే..
పరిచయం అయినప్పటి నుంచి తానే ప్రాణంగా బతికిన వేణు.. పెళ్లికి ఒప్పుకోవడానికి కారణమేంటని ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటపడింది. యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని.. అది తనకు నచ్చట్లేదని చెప్పినా..ఆమె వినలేదని తెలిసింది. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి.. వేరే అతనితో సన్నిహితంగా ఉండటం నచ్చని వేణు.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.