Young Woman Died Due to Abortion: భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఐదు నెలల తర్వాత బాధితురాలికి అబార్షన్ చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అబార్షన్ చేశాక పరిస్థితి విషమించి యువతి మృతి చెందింది. దాంతో యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. చివరికీ అమ్మాయి తల్లిదండ్రుల సమాచారంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలలోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యువతి కాలేజ్‌కు వెళ్లే సమయంలో పక్క గ్రామం పుసుగూడెంకి చెందిన ఆటో డ్రైవర్ నందు ఆమెతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అలా అమ్మాయితో చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. నువ్వే లోకమంటూ ఆమెను మాయ చేశాడు. అతడి మాయమాటలు నమ్మిన ఆ గిరిజన యువతి నిజంగానే తనని ప్రేమిస్తున్నాడనుకుంది. అతడు అడగ్గానే శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో కొన్ని రోజుల క్రితం టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి రక్తస్రావం అవుతుండడంతో తన భార్య అని చెప్పి అబార్షన్ చేయించేందుకు భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో అమ్మాయికి ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నందుతో పాటు అతని వెంట వచ్చిన మరొక మహిళ కూడా అక్కడ నుంచి పరారయ్యారు.