లాక్‌డౌన్ వల్ల ఇంటి వద్ద ఉంటున్న బాలిక(16) చరవాణికి బానిసైంది. అర్ధరాత్రి తల్లితో గొడవ పెట్టుకుంది.. తెల్లవారుజామున రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు పరిశీలించి.. ఆత్మహత్యగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు వివరాల ప్రకారం..
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన దంపతులు పదేళ్ల క్రితం ఘట్‌కేసర్ మండలం రాజీవ్‌గృహకల్ప కాలనీలో అద్దెకుంటున్నారు. బాలిక తండ్రి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. బాలిక నారాయణపేట జిల్లా సంగబండలోని ప్రభుత్వ బాలిక గురుకుల పాఠశాలలో పదో తరగతి పాసైంది. లాక్‌డౌన్‌తో రాజీవ్‌గృహకల్ప కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నిత్యం చరవాణిలో ఆటలతో పాటు స్నేహితులతో మాట్లాడేది. పలుమార్లు తల్లి మందలించేది.
ఈనెల 16న తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం సొంతూరుకు వెళ్లారు. ఇంట్లో బాలిక తల్లి, తమ్ముడితో కలిసి ఉంది. శుక్రవారం రాత్రి చరవాణిలో మాట్లాడుతుండగా తల్లి కోప్పడింది. తల్లి, కుమార్తెలు గొడవ పడి, నిద్ర పోయారు. రాత్రి 11.17 గంటల(సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు అయ్యాయి) ప్రాంతంలో ఇంట్లో నుంచి కిరోసిన్ సీసాతో బయటకొచ్చి ఇంటి తలుపులకు గడియ పెట్టింది. సుమారు కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్లింది. ఘట్‌కేసర్-ఎల్‌బీనగర్ మార్గంలో ఉన్న ఓఆర్‌ఆర్ పక్కన ఖాళీ ప్రదేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది.
ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు షీ బృందం డీసీపీ సలీమా, అదనపు సీఐలు కె.జంగయ్య, విజయబాబు పరిశీలించారు. తల్లి మందలించడంతోనే మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సీఐ ఎన్.చంద్రబాబు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పంపించామని, పరీక్షలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.