cheating farmers: రైతులకు వ్యవసాయ పరికరాల పేరుతో రైతులను నిలువునా మోసంచేసిన వ్యక్తులపై... నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌కి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు.. పోలీస్ స్టేషన్‌కి వరుసకట్టారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయంచేయాలని పోలీసులను ఆశ్రయించారు. తిప్పర్తికి చెందిన నూకల నాగరాజు గతంలో వాటర్‌షెడ్‌లో అసిస్టెంట్‌గా పని చేశాడు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పరికరాలు రాయితీపై.. తక్కువ ధరలకే ఇప్పిస్తానంటూ కోట్లు కొల్లగొట్టాడు.
ఒకరిద్దరు రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి నమ్మకం కలిగించడంతో... సుమారు 500 మంది రైతులు రూ. 10 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. పైసలు ఇచ్చినందన పరికరాలు ఇవ్వాలంటూ కొద్దిరోజులుగా అన్నదాతలు తిరుగుతున్నా సరైన స్పందనలేదు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ రెండురోజుల కిందట తిప్పర్తి లో ఉంటున్న.. నూకల నాగరాజును నిలదీసేందుకు ఇంటికివెళ్లగా తాళం వేసి ఉండటంతో రైతులు ఆందోళన చేశారు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.