అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అంతేకాదు కార్యాలయంలో అందరికన్నా ఉన్నతస్థాయి అధికారి. కానీ అతని ప్రవర్తన మాత్రం అందరూ అసహ్యించుకునేలా ఉంది. ఇది ఏదో ఒక రోజు జరిగింది కాదు.. ప్రతిరోజూ ఇలాగే జరుగుతోంది. అసలేం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో జి. చంద్రరావు ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ చంద్రరావు నిత్యం మద్యం తాగేవాడు. రోజు మద్యం సేవించి విధులకు హాజరయ్యే వాడు. మద్యం మత్తులో తోటి ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇటీవల చంద్రరావు ఫుల్గా తాగి కార్యాలయానికి వచ్చాడు. అక్కడే పని చేస్తున్న తోటి ఉద్యోగితో సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. దీనిని తోటి ఉద్యోగులు వీడియో తీశారు. అది కాస్త బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది.
రోజు అదే పని..
ప్రతిరోజూ చంద్రరావు మద్యం సేవించి విధులకు హాజరయ్యేవారని తోటి ఉద్యోగులు తెలిపారు. అతని ప్రవర్తనపై విసుగు చెందినా... అందరి కన్నా ఉన్నత స్థానంలో ఉన్నారని ఓపికగా ఉన్నట్లు వెల్లడించారు. రోజు తాగి వచ్చి మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని.. కాసేపయ్యాక తన కుర్చీలోనే పడుకుంటాడని తెలిపారు. గతంలో అతను పని చేసిన కురుపాం ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ప్రతిరోజూ మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడని.. ఇప్పటికీ తన తీరు మారలేదని ఆరోపించారు.
అతని వికృత చేష్టల వీడియో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సూర్య కుమారి.. చంద్రరావును సస్పెండ్ చేశారు. కార్యాలయ ఆవరణలో మద్యం సేవిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారిని విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పని ఒత్తిడి వల్లే అతను ప్రతిరోజూ మద్యం సేవించి అలా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం.
ఇదీ చదవండి:Mla Bhagath: నాగార్జున సాగర్ శాసనసభ్యుడిగా భగత్ ప్రమాణస్వీకారం