తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుంటూరుకు సరదాగా వెళ్లి... గంజాయి తాగుతూ పట్టుబడిన హైదరాబాదీ విద్యార్థులు - రావులపాలెంలో గంజాయి పట్టివేత

Ganja Smuggling : ఒకనాడు గంజాయి పట్టుబడడం పెద్దవార్తే. ఎవరైనా గంజాయి తాగుతున్నారంటే.. పెద్ద నేరంగా భావించే వారు. ఇప్పుడు.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ మత్తు పదార్థం తరలిస్తూ పట్టుబడడం సాధారణ విషయంగా మారిపోతే.. పల్లెల్లో పిప్పరమెంటు బిళ్లలమాదిరిగా లభించడం మామూలైపోయింది!

Ganja Smuggling
Ganja Smuggling

By

Published : Dec 4, 2021, 9:19 PM IST

Ganja Smuggling : గంజాయి రవాణాపై నిఘా ఎంత పెరిగినా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయిని.. స్మగ్లర్లు గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు పట్టణాలు, మండలాల్లో దొరికిన గంజాయి.. ఇప్పుడు పల్లెల్లో సైతం ఎక్కువ మొత్తంలో పట్టుబడుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.

పల్లెటూళ్ల దాకా విస్తరించిన.. గంజాయి వేళ్లు..!!

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు..
ఓ లాడ్జిలో గంజాయి, ఎల్ఎస్డీ వినియోగిస్తున్న ముగ్గురు విద్యార్థులను ఏపీలోని గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బ్రాడీపేట నాలుగో లైనులో ఓ లాడ్జిపై పోలీసులు దాడి చేసి 50 గ్రాముల గంజాయి, 3 ఎల్​ఎస్​డీ స్ట్రిప్పులు, రూ.8,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడుపుదామని వచ్చి.. గంజాయి తాగుతూ పోలీసుల చేతికి చిక్కారు. వీరికి డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్​కు చెందిన రేవంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

Ganja seized : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై.. ప్రైవేటు బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రావెల్ బస్సులో.. రూ.72లక్షల విలువగల 715 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.. రిమాండ్ నిమిత్తం నిందితులను కొత్తపేట కోర్టుకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.

కృష్ణా జిల్లాలో..

Ganja seized in krishna : కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తపెదమద్దాలి బైపాస్ వద్ద.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు గుడివాడ, గుడ్లవల్లేరుకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందన్న కేంద్రం..

పై ఘటనలు కేవలం ఈ రోజువి మాత్రమే. ఇలాంటి ఘటనలు ఏపీలో నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితి గడిచిన మూడేళ్లలో మరింత విశృంఖలంగా మారిందని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ లెక్కలతో సహా వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం.. తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. గడిచిన మూడేళ్లలో గంజాయి సరఫరా ఏకంగా మూడు రెట్లు పెరిగింది వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details