తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja seize: కోటికి పైగా విలువైన గంజాయి సీజ్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Ganja seize: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఇవాళ మరో రెండు చోట్ల భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పీఎస్​ పరిధిలో 525 కిలోలు స్వాధీనం చేసుకోగా.. ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Ganja seized
గంజాయి తరలిస్తున్న ముఠాల అరెస్ట్

By

Published : Dec 9, 2021, 10:26 PM IST

Ganja seize: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పెద్దఎత్తున గంజాయిని పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నా.. స్మగ్లింగ్ ఆగడం లేదు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు.. కోటి నాలుగు లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా రాజస్థాన్​కు వెళ్తున్న లారీని తనిఖీ చేసిన పోలీసులు.. 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర బాబు వెల్లడించారు. గంజాయి అరికట్టడంలో భాగంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇద్దరు వ్యక్తులు 525 కేజీల గంజాయిని రాజస్థాన్​కు తరలిస్తుండగా పట్టుకున్నాం. దీని విలువ కోటి నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది. అంతర్రాష్ట్ర రవాణాను అడ్డుకునేందుకు గట్టి నిఘా పెంచాం. ఎస్పీ సూచనలతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనే చర్యలు తీసుకుంటున్నాం.

-వెంకటేశ్వర బాబు, డీఎస్పీ కొత్తగూడెం

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Interstate gang: గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నారు. వారి నుంచి సుమారు రూ.5 లక్షల 30 వేల విలువైన 53 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని చింతలూరు, ఒడిశాలోని మల్కాన్​గిరి ప్రాంతాల్లో రహస్యంగా సేకరించిన గంజాయిని మధ్యవర్తుల ద్వారా తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఒక స్మగ్లర్​తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెక్కొండ ప్రాంతంలో గంజాయిని అందజేసేందుకు వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. గంజాయిని రెండు, ఐదు కిలోల ప్యాకెట్ల రూపంలో రెండు ద్విచక్ర వాహనాలపై నెక్కొండకు తీసుకొస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. ఆ వాహనాలను తనీఖీలు చేస్తున్న సమయంలో.. బైక్​ వెనక కూర్చున్న కోస్రా రాజు తప్పించుకోని పారిపోగా.. ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారని సీపీ తెలిపారు.

ఇవాళ గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశాం. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ​నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలి.

- తరుణ్ జోషి, వరంగల్‌ నగర పోలీస్ కమిషనర్.

ABOUT THE AUTHOR

...view details