Ganja Seized: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కట్టడిపై ముమ్మర చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డిబావి గ్రామంలో కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఒక కారును తనిఖీ చేయగా.. 100 కిలోల గంజాయి, 10 లీటర్ల హషిష్ ఆయిల్ పట్టుబడింది.
ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కారు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మత్తు పదార్థాల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 46లక్షల విలువ ఉంటుందని యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నిందితులు కేరళకు చెందిన వారిగా గుర్తించామని.. వీరు లంబసింగి ప్రాంతంలో కొనుగోలు చేసి విశాఖ మీదుగా వెళ్లి కేరళ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తారని పోలీసులు వెల్లడించారు.