మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అచ్చం సినిమాని తలపించేలా జరిగిన ఓ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. నలుగురు వ్యక్తులు పక్కా ప్లాన్ చేసి ఓ మహిళను అత్యాచారం చేశారు. భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో దారుణానికి పాల్పడ్డారు. భర్తను అతిదారుణంగా కొట్టి కాళ్లూ చేతుల కట్టేసి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి కొడవళ్లు చూపించి బెదిరించి అత్యాచారం చేశారు.
అసలేం జరిగిందంటే..
మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించి గుంటూరు జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. మేడికొండూరు మండలం పరిధిలో మహిళపై సామాహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లికి చెందిన మహిళ మేడికొండూరు మండలం పాలడుగులోని బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు వెళ్లింది. తన భర్తతో కలిసి సత్తెనపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలడుగు అడ్డరోడ్డులో వెళ్తుండగా రోడ్డుపై చెట్టు పడి ఉంది. చెట్టు పక్కగా వెళ్తుండగా బైక్‌కు కట్టె అడ్డుపెట్టారు. దీంతో దంపతులిద్దరూ కింద పడ్డారు.రాత్రి 9.45 గంటల సమయంలో మార్గమధ్యలో వారిని దుండగులు అడ్డుకున్నారు.
గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. కొడవళ్లు చూపించి బెదిరించారు. చేతులతో చితకబాదారు. భర్త చేతులు కాళ్లు కట్టేశారు. మహిళను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం, బంగారు ఉంగరం, కాళ్ల పట్టీలు తీసుకున్నారు. కొడవళ్లు చూపించి జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. తమపరిధిలోకి రాదని అన్నారు.
దీంతో ఇవాళ ఉదయం మేడికొండూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై ఐపీసి సెక్షన్ 376డి, 394, 342 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరిక్షలు నిర్వహించి అనంతరం చికిత్స అందిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఘటనా స్థలాన్ని గుంటూరు డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ కేసు నమోదు చేయకపోవటాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఫిర్యాదు తీసుకుని జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా తమ పరిధి కాదని తప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు.