తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు.. - case against filed on MP Raghurama

Gachibowli police registered a case against MP Raghurama
Gachibowli police registered a case against MP Raghurama

By

Published : Jul 5, 2022, 5:35 PM IST

Updated : Jul 5, 2022, 10:40 PM IST

17:33 July 05

ఎంపీ రఘురామపై కేసునమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్ భాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్‌, సీర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ, రఘురామ పీఏ శాస్త్రిలను ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.

ఏం జరిగిందంటే?హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం నియోజకవర్గం ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు చూపేందుకు నిరాకరించాడు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఎంపీని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ..శనివారం ఉదయమే 10-12 మంది వ్యక్తులు రెండు కార్లలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇన్నోవాలో గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద కాపు గాసినట్టు సమాచారం. ఆయన వాహనాన్ని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ వచ్చారు. ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాత్రి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం బయల్దేరిన ఎంపీ రఘురామ ప్రధాని సభకు వెళ్లకుండానే బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ రఘురామ నివాసంలోకి ఒకరు ప్రవేశించి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నించారు. ఇది గుర్తించిన ఎంపీ అనుచరులు అప్రమత్తమయ్యారు. దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి ఫరూక్ భాషా అని, అతడి ఫోన్‌కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తిని గమనించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ వెల్లడించారు. ఈమేరకు ఎంపీ రఘురామతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది.

ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా నాపై దాడి చేశారు. ఎంపీ రఘురామ ఇంట్లో నన్ను 3 గంటలు నిర్బంధించారు. రఘురామ సహా ఐదుగురు నాపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నాపై దాడి చేశారు. నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని చెప్పినా వినలేదు. నా ఐడీ కార్డు, పర్స్‌ లాక్కుని విడతలవారీగా హింసించారు. ఎంపీ, మరో ముగ్గురు లాఠీలతో కొట్టి దుర్భాషలాడారు. - ఫరూక్ భాషా, కానిస్టేబుల్

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తన ఇంటి వద్ద రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. నిన్న తన ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని కేటాయించారని వెల్లడించారు. రెక్కీ నిర్వహించినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెక్కీ నిర్వహించినవారిలో ఒకరిని పట్టుకున్నారు.. కానీ రెక్కీ చేసిన వారిలో మిగతా వ్యక్తులు కారులో పారిపోయారన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాన్‌ అలీబాషా అని చెప్పాడని వెల్లడించారు. ఐడీ కార్డు చూపాలని అడిగితే నిరాకరించాడని పేర్కొన్నారు. ఉన్నతాధికారికి ఫోన్ చేయాలని అడిగినా చేయలేదన్నారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రెక్కీ నిర్వహణకు కారణాలపై విచారణ చేయాలని కోరామని లేఖలో చెప్పారు. రెక్కీలపై గతంలో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ విచారణ చేయలేదని వివరించారు.

ఇదీ చూడండి: ఎంపీ రఘురామ ఇంటివద్ద ఆగంతకుడి గుర్తింపు.. తీరా చూస్తే అతడు..!

Last Updated : Jul 5, 2022, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details