తెలంగాణ

telangana

ETV Bharat / crime

అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లు!

అధిక వడ్డీ ఆశ... వందలాది మంది జేబులు గుల్ల చేసింది. చెప్పిన సమయానికే వడ్డీ ఇచ్చేస్తుంటే పూర్తిగా నమ్మేసిన అమాయకులు... అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. బోగస్‌ సంస్థ బోర్డు తిప్పేసరికి... లబోదిబోమంటున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల దాకా కొల్లగొట్టారని బాధితులు చెబుతున్నారు. మోసపోయిన వ్యక్తి బంధువైన ఓ ప్రజాప్రతినిధి... నిందితుల వద్ద 5 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లు!
అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లు!

By

Published : Apr 15, 2021, 7:45 AM IST

"లక్ష రూపాయలు చెల్లించండి... ప్రతినెలా 30 వేల వడ్డీ పొందండి".. అనంతపురం జిల్లాలో ఎంతోమంది అమాయకులను ఆకట్టుకున్న ఈ ఆఫర్‌... తమదాకా రానివారు సంతోషించాల్సిందే. ఎందుకంటే అధిక వడ్డీకి ఆశపడి... జీవితాంతం సంపాదించిందే కాకుండా, అప్పులు తెచ్చిమరీ పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయిన వాళ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లు!

ఈ-బిడ్ ఫైనాన్స్ సర్వీసెస్‌ పేరుతో వెలసిన ఓ బోగస్‌ సంస్థ... లక్ష రూపాయలు చెల్లిస్తే నెలకు 30 వేలు వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేసింది. చెప్పినట్లుగానే కొన్ని నెలలపాటు వడ్డీ చెల్లించింది. ఈ విషయం ఆనోటా, ఈనోటా తెలుసుకున్న ఎంతోమంది... అధికమొత్తంలో పెట్టుబడులు పెట్టారు. దండిగా వసూలు చేసుకున్న కంపెనీ ప్రతినిధులు... ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. "ఆడిట్‌ జరుగుతోంది... అయ్యాక ఇస్తాం. కరోనా కేసులు పెరిగాయి వ్యాపారానికి నష్టం వచ్చింది" వంటి సాకులతో వడ్డీలు ఎగ్గొట్టిన ఆ సంస్థ... ఆ తర్వాత అసలు డబ్బులూ ఎగ్గొట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు... మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ కంపెనీ పేరుతో వ్యవహారం నడిపిన మోసగాళ్లు... గతంలో ఆ సంస్థలో ఉద్యోగం మానేసిన వారేనని తెలుస్తోంది. తొలుత బెలుగుప్ప నుంచి మొదలైన వడ్డీ చెల్లింపు పథకం... అక్కడి సర్పంచ్‌ బంధువుల ప్రచారంతో ఊరూరా పాకింది. క్రమంగా ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా అంతటా విస్తరించింది. అనంతపురం, ధర్మవరం, బెలుగుప్ప, తాడిపత్రి సహా పలు మండలాలకు చెందిన ప్రజలు... లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. స్నేహితులు, బంధువులకూ చెప్పి... వాళ్లతోనూ పెట్టించారు. కొందరైతే ఏకంగా బంగారం కుదవపెట్టి, అప్పులు తెచ్చి డబ్బులు కట్టారు. తొలుత కచ్చితంగా 30 వేలు చెల్లిస్తూ వచ్చిన మోసగాళ్లు... తర్వాత కల్లబొల్లి కథలు చెప్పి 20 వేలకు తగ్గించారు. ఇది మోసం అని ప్రజలంతా తెలుసుకునేలోపే... వసూలు చేసిన డబ్బులతో ఉడాయించారు.

మోసపోయినవాళ్లలో పోలీసులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి బంధువులు దాదాపు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు సమాచారం. వారి తరఫున రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధి... సదరు కంపెనీ ప్రతినిధులను పిలిపించి 5 కోట్ల రూపాయలు దాకా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోసపోయిన కొందరు పోలీసులు... ధర్మవరం మండలంలోని నిందితుల స్వగ్రామాలకు వెళ్లి కార్లు, ఇతర విలువైన వస్తువులు తెచ్చుకున్నట్లు సమాచారం. చాలా మంది బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ సత్యఏసుబాబును కలిసి మోసం జరిగిన తీరును వివరించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని... ఎన్ని కోట్ల మోసం జరిగిందో ఇంకా నిర్ధరణ కాలేదని పోలీసులు చెబుతున్నారు.

డిపాజిట్‌ చేసిన సొమ్మును ఇదివరకే వడ్డీ రూపంలో పొందిన కొంతమంది.... ఏం జరుగుతుందో ఏమో అనే భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details