Cyber cheating: నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో వెరైటీ మోసంతో దోచుకుంటున్నారు కేటుగాళ్లు. అలాంటి ఓ ఘరానా మోసమే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. గొంతు మార్చి ఆడగొంతుతో తియ్యగా మాట్లాడి.. తెలుగు రాష్ట్రాల్లో వందల మంది వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేశాడో యువకుడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి పట్టణానికి చెందిన రావూరి కుమార్ అనే వ్యక్తి ఆడగొంతుతో పలువురుని మోసం చేసి డబ్బులు వసూలు చేశాడు. గత ఏప్రిల్‌లో ఓ వ్యక్తికి ఫోన్ ద్వారా పరిచయమైన కుమార్.. ఆడ గొంతుతో మాయమాటలు చెప్పాడు. తన ఇంట్లో పరిస్థితి బాగోలేదని పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని కొంత నగదు సాయం చేయాలని కోరాడు. ఆమె (అతడు) మాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి రూ. 16 వేల నగదును ఫోన్‌పే చేశాడు. ఇలా జరిగిన తర్వాత మరోసారి ఇంకా డబ్బు కావాలని అడిగాడు.
ఇతను ఒక మిస్స్డ్ కాల్ ద్వారా అతను పరిచయమైనట్లు తేలిసింది. ఆడవాళ్ల గొంతుతో మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు తీసుకోవడం జరిగింది. పిల్లలకు బాగాలేదని చెప్పి ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి 16 వేల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అతనితో పాటు రెండేళ్లుగా చాలామందిని గొంతుమార్చి ఇలానే మోసం చేసినట్లు తేలింది. జల్సాలకు అలవాటు పడి ఇలా మోసాలకు పాల్పడినట్లు గుర్తించాం. నిందితుడు రాయచోటిలోని పోస్ట్ ఆఫీస్ వీధికి చెందిన కుమార్‌గా గుర్తించాం-సీఐ, రాయచోటి
ఆ వ్యక్తి తన వద్ద లేవని చెప్పటంతో.. కుమార్ తన అసలు రూపం బయటపెట్టాడు. తనతో మాట్లాడిన మాటలను రికార్డు చేశానని.., వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. భయపడిపోయిన బాధితుడు రాయచోటి పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు రాయచోటిలోని పోస్ట్ ఆఫీస్ వీధికి చెందిన కుమార్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆడ గొంతుతో మోసం చేస్తుంది తానేనని ఒప్పుకున్నాడు. ఏపీ-తెలంగాణల్లో వందల మందిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. విడతల వారీగా బాధితుల వద్ద నుంచి దాదాపు రూ.8 లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.