తెలంగాణ

telangana

ETV Bharat / crime

UPADI HAMI: రూ.370 కోట్ల దుర్వినియోగం... పని చేయకున్నా చేసినట్లు రికార్డులు - తెలంగాణలో ఉపాధి హామీ పథకం వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లేక పేదలు వలసబాట పట్టకుండా కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. క్షేత్రస్థాయి పనులపై పర్యవేక్షణ కొరవడటంతో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పొలంలో ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా, సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది ఆ పనుల తనిఖీకి వెళ్లినపుడు ఆనవాళ్లు కనిపించడం లేదు.

UPADI HAMI PATHAKAM
ఉపాధిహామీ పథకం

By

Published : Jul 15, 2021, 7:14 AM IST

ఉపాధిహామీ పథకం (UPADI HAMI PATHAKAM) అమలు బాధ్యత ఈ ఏడాది నుంచి గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఈ పథకం కింద 33.04 లక్షల కుటుంబాల్లోని 58.76 లక్షల మంది కూలీలు లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది నుంచి రోజువారీ వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు ప్రభుత్వం పెంచింది. గ్రామకార్యదర్శులపై నిఘా ఎక్కువగా ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాధిహామీ (UPADI HAMI) సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ కింద చేపట్టేపనుల వివరాలను తప్పనిసరి రికార్డు చేయాలి. పనులు చేస్తున్నపుడు ఫొటోలు తీసి వాటిని భద్రపరచాలి. పూర్తయ్యాక రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ తరువాతే బిల్లులు సిద్ధం చేసి పంపించాలని నిబంధనలున్నా అమలు కావడం లేదు.

కనిపించని ఆధారాలు, వివరాలు

పొలంలో ఉపాధి హామీ పనులు (UPADI HAMI WORKS) చేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా, సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది ఆ పనుల తనిఖీకి వెళ్లినపుడు ఆనవాళ్లు కనిపించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా రైతులతో బలవంతంగా పనులు జరిగాయని, ఇప్పుడు పంట వేశామని చెప్పిస్తున్నట్లు వెల్లడవుతున్నా, చేసేదేమీ లేక అలాగే రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. జిల్లాల్లోని సామాజిక తనిఖీ నివేదికల్లో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఇతర పనుల ఆనవాళ్లు లేవని అడిగినపుడు ఆధారాలు, వివరాలు ఇవ్వడం లేదు. పనులు చేయకున్నా వారితో చేసినట్లు సంతకాలు తీసుకుని, సంతకాలు చేయాలంటూ ఉపాధిహామీ సిబ్బందిని బెదిరిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. పనులు జరగకున్నా బిల్లులు తీసుకున్నారని వెల్లడైనపుడు సంబంధిత సిబ్బంది, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నా అడుగులు పడటం లేదు.

అక్రమాలపై అడిగితే దాడులు..!

ఉపాధి కింద చేయని పనులు చేసినట్లు చూపించడం, కొన్నిచోట్ల కూలీలతో బలవంతంగా సంతకాలు చేయించి పంచాయతీ, ఉపాధిహామీ సిబ్బందిని బెదిరించి బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు. నిర్మల్‌ జిల్లా కుభీరు మండలం పాతసాంవ్లీ గ్రామంలో ఇంకా పూర్తికాని పనులకు పూర్తయినట్లు బిల్లులపై సంతకాలు పెట్టాలని ఆ గ్రామ సర్పంచి ఉపాధిహామీ సాంకేతిక సహాయకుడిని డిమాండ్‌ చేయగా ఆయన అంగీకరించలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన సంఘటన క్షేత్రస్థాయి అక్రమాలకు అద్దం పడుతోంది. ఉపాధి హామీ (UPADI HAMI) అవకతవకలపై సామాజిక తనిఖీ సంస్థ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవడం లేదు. ఉపాధిహామీలో ప్రతిఏటా పదిశాతానికిపైగా పనుల్లో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు సామాజిక తనిఖీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌తో దాడి

రికవరీకి ఆదేశించినా..

ఉపాధి పనుల్లో సామాజిక తనిఖీ వివరాలను పరిశీలిస్తే 2018-19 పనుల్లో రూ.233.33కోట్లు, 2019-20లో రూ.37.13 కోట్లు దుర్వినియోగమయ్యాయని, ఈ నిధులను రికవరీ చేయాలని ఆదేశించినా ప్రభుత్వ చర్యలు లేకుండా పోయాయి.

23 పంచాయతీల్లోనే రూ.3.19 కోట్లు..

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించగా రూ.3.19కోట్ల అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. కూలీలు పనిచేయకున్నా చేసినట్లు చూపించడం, చనిపోయిన వారిపేర్లపైనా జాబ్‌కార్డులు జారీ చేసినట్లు వెల్లడైంది. ఓ గ్రామంలోని వైద్యదంపతులూ ఉపాధి కూలీలుగా పనిచేసినట్లు జాబ్‌కార్డులను సృష్టించడం గమనార్హం. మండలంలో 230 పనులు జరిగినట్లు రికార్డుల్లో ఉంటే.. క్షేత్రస్థాయిలో 77 పనులు మాత్రమే చేసినట్లు తేలింది. మిగతా పనులేమీ చేయకుండానే నిధులు మింగేసినట్లు సామాజిక తనిఖీ బయటపెట్టింది.

ఇదీ చూడండి:Upadi Hami: ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం

ABOUT THE AUTHOR

...view details