బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. ఆపై రైతు బీమాకు దరఖాస్తు చేసి వచ్చిన 5 లక్షల రూపాయలను కుటుంబసభ్యులకు తెలియకుండా కాజేశాడో మోసగాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ చనిపోయిందని నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆ పత్రాలతో రైతు బీమాకు దరఖాస్తు చేశాడు.
చంద్రమ్మ కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి రైతు బీమా కింద వచ్చిన 5 లక్షలను కాజేశాడు. తన తల్లి చంద్రమ్మ రైతు బంధు పైసలు పడలేదని... బాలయ్య అధికారులను ఆశ్రయించాడు. చంద్రమ్మ చనిపోయినందుకు రైతుబీమా డబ్బులు ఖాతాలో పడిందని వ్యవసాయశాఖ అధికారులు సమాధానం ఇవ్వడంతో బాలయ్య కంగుతిన్నాడు. బతికున్న తన తల్లి చనిపోయిందనడమేంటని అధికారులు నిలదీశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో... కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.