బీమా డబ్బుల కోసం తల్లి చనిపోయిందని నకిలీ మరణ ధ్రువపత్రం సమర్పించి రూ.5 లక్షల రైతు బీమా సొమ్మును స్వాహా చేశాడు ఓ కొడుకు. అతడు చేసిన నిర్వాకం ఏడాది క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కోల లింగమ్మకు చలి చీమల పాలెం శివారులో 9 గుంటల భూమి ఉంది. లింగమ్మ కుమారుడు వీరస్వామి, సమీప బంధువైన ఉప సర్పంచ్ కోలా సైదులు సహకారంతో గత ఏడాది ఏప్రిల్ 6, 2021న తల్లి మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. ఆమెకు రావాల్సిన రైతు బీమా పరిహారం కోసం నామినీ అయినా వీరస్వామి ఏప్రిల్ 16న దరఖాస్తు చేశాడు. మే 6న బీమా పరిహారం డబ్బులు రూ.5 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి.
ఈ క్రమంలో తల్లి లింగమ్మ రెండు పర్యాయాలుగా రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో జూన్ 16న వేములపల్లి వ్యవసాయ అధికారులను సంప్రదించింది. ఆన్లైన్లో పరిశీలించిన అధికారులు ఆమె అప్పటికే చనిపోయినట్లు.. రైతు బీమా పరిహారం కూడా పొందినట్లు రికార్డులు నమోదు అయిన విషయం గుర్తించారు. దీంతో పాటు రైతు బీమా పరిహారం కోసం సమర్పించిన మరణ ధ్రువపత్రాన్ని జారీచేసిన గ్రామ కార్యదర్శి సంప్రదించగా.. తాను లింగమ్మ పేరుతో ఎటువంటి పత్రం జారీ చేయలేదని చెప్పారు.