ప్రపంచ మొత్తం భారత వైవాహిక బంధానికి ఆకర్షితులవుతుంటే... కొన్ని ఘటనలు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయి. మ్యాట్రిమోని ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం.. ఉద్యోగం, ఆస్తి ఉందని.. మంచిగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పడం... అది నమ్మి యువతులు మోసపోతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే పెద్దపల్లి జిల్లా మంథనిలో వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోని ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకుని ఐదు వివాహాలు చేసుకున్న ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతాన్ని అతని నాలుగో భార్య కనిపెట్టింది. దాంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన ఓ యువతితో 6 నెలల క్రితమే ఆ మోసగాడికి ఐదో వివాహం జరిగింది. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మంగళపల్లికి చెందిన సగనమోని మద్దిలేటి అలియాస్ మధు అనే వ్యక్తి సుమారు 4 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.