తెలంగాణ

telangana

ETV Bharat / crime

Mahesh Bank Case: మహేశ్‌బ్యాంక్‌ కేసులో కొనసాగుతున్న ప్రధాన నిందితుల వేట - మహేశ్‌బ్యాంక్‌ కేసులో నిందితులు అరెస్ట్‌

Mahesh Bank Server Hacking Case: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా రూ.12.90కోట్లు కాజేసిన ప్రధాన నిందితులు కాకుండా వారు ఆడించిన పాత్రధారులే దొరుకుతున్నారు. కేరళ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ వేర్వేరు ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్న హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నలుగురు నిందితులను తాజాగా అరెస్ట్‌ చేశారు.

Mahesh Bank Case
Mahesh Bank Case

By

Published : Feb 12, 2022, 5:16 AM IST

Mahesh Bank Server Hacking Case: ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్ దాడి కేసులో ప్రధాన నిందితుల వేట కొనసాగుతోంది. పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా అసలు సూత్రధారులు కాకుండా కేవలం పాత్రధారులే దొరుకుతున్నారు. కేరళ నుంచి ఈశాన్యరాష్ట్రాల వరకూ వేర్వేరు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నలుగురిని ఇటీవల అరెస్ట్‌ చేశారు. ఇందులో ముంబయి వాసి అర్బాజ్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించాడని ఆధారాలు సేకరించారు. నైజీరియన్లకు పదుల సంఖ్యలో బ్యాంక్‌ ఖాతాలు సమకూర్చాడని తెలుసుకున్నారు. వారి సూచన మేరకు మహేశ్‌బ్యాంక్‌లో పొదుపు ఖాతా ప్రారంభించిన హైదరాబాదీ యువతి షానాజ్‌కు, అర్బాజ్‌ ఖాన్‌కు డబ్బులావాదేవీలు సహా ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఆ సమాచారం ఆధారంగా..

Mahesh Bank Case updates: మహేశ్‌బ్యాంక్‌లో ఖాతాలున్న నలుగురిని ఎంపిక చేసుకున్న ప్రధాన నిందితులు సర్వర్‌హ్యాక్‌ చేసి రూ.12.90కోట్ల నగదును దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లోని బ్యాంకుల్లో 128 ఖాతాల్లో జమచేశారు. బ్యాంక్‌ ఖాతాదారుల చిరునామాలు, ఫోన్‌నంబర్ల ఆధారంగా పదమూడుమందిని అరెస్ట్‌చేశారు. బెంగుళూరులో ఓ నిందితుడి వద్ద దొరికిన సమాచారం ఆధారంగా పరిశోధించగా.. ముంబయిలో అర్బాజ్‌ఖాన్, యూపీలోని బరేలీలో మహ్మద్‌ అక్తర్, కోల్‌కతాకు సమీపంలోని సీతానాథ్‌పూర్‌లో పార్థో హల్దార్, యూపీలోని సుల్తాన్‌పూర్‌లో విజయ్‌ప్రకాష్‌ ఉపాధ్యాయ్‌లు నైజీరియన్లకు ఖాతాలు సమకూర్చారని తేలింది.

కమీషన్‌కు ఖాతాలు...

వెంటనే అప్రమత్తమైన ప్రత్యేకబృందాలు ముంబయి, యూపీ, కోల్‌కతాలకు వెళ్లి అర్బాజ్‌ఖాన్, మహ్మద్‌ అక్తర్, విజయ్‌ప్రకాష్, పార్థోహల్దార్‌లను అదుపులోకి తీసుకున్నాయి. నలుగురు నిందితులూ నైజీరియన్ల వద్ద 10శాతం నుంచి 20శాతం వరకు కమీషన్‌ తీసుకుని బ్యాంక్‌ ఖాతాలను సమకూర్చినట్టు పోలీసులు వివరాలను సేకరించారు. ఈ నలుగురు సమకూర్చిన ఖాతాల్లోనే కొల్లగొట్టిన సొమ్ములో అరవై శాతానికిపైగా నగదు బదిలీ చేసుకున్నట్టు తేలింది. హైదరాబాద్‌ నుంచి ముంబయికి తరచూ రాకపోకలు కొనసాగిస్తున్న హైదరాబాదీ యువతి షానాజ్, అర్బాజ్‌ఖాన్‌ను కలుసుకుందా?.. లేదా?..అని ఆరాతీస్తున్నారు. యూపీ, ముంబయి, కోల్‌కతాలో మరికొన్ని ఖాతాలుండడంతో నిందితుల కోసం వేటకొనసాగిస్తున్నారు.

నైజీరియన్లను ట్రాక్‌ చేసేందుకు...

మహేశ్‌బ్యాంక్‌పై సర్వర్‌దాడికి పాల్పడ్డ నైజీరియన్లు ఎక్కువగా బెంగుళూరు, దిల్లీలో ఉంటున్న నైజీరియన్లతో మాట్లాడి తమకు సహకరించాలని కోరినట్టు పోలీసులు తెలుసుకున్నారు. దిల్లీలో ఒక్కేసోలమన్‌ అనే నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతడిచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితులతో సంబంధాలున్నవారిని పట్టుకునేందుకు ఇద్దరు సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్లు సహా ఎనిమిదిమంది పోలీస్‌ అధికారులు దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. నైజీరియన్లు వినియోగించిన ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌కాల్స్, నగదు విత్‌డ్రా చేసిన ఏటీఎంలు ఇలా వారికి అనుమానం వచ్చిన ప్రతిచోటా గాలిస్తున్నారు. సర్వర్‌హ్యాక్‌ చేసిన నిందితులు ప్రాక్సీ, స్ఫూఫింగ్‌ ఐపీ చిరునామాలు వినియోగించడంతో వీరిని గుర్తించడం కొంత ఆలస్యమవుతోందని పోలీస్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:Lands auction in telangana: సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

ABOUT THE AUTHOR

...view details