విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి - విశాఖలో దారుణం
07:55 April 15
ఓ అపార్ట్‌మెంట్‌లో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
ఏపీలోని విశాఖలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదవశాత్తా లేక హత్య అన్న కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. మధురవాడ మిథిలాపురికాలనీలోని ఆదిత్య టవర్స్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ 505 ఫ్లాట్ నెంబర్‌లో అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. పొగలు, మంటలు చూసి పోలీసులకు స్థానికుల సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మంటల ధాటికి ఇంట్లో ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు.
మృతులు బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ గా గుర్తించారు. బంగారునాయుడు, నిర్మల దంపతులు కాగా.. వారి పిల్లలు 22 ఏళ్ల దీపక్, 19 ఏళ్ల కశ్యప్. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు. బెహ్రయిన్‌లో స్థిరపడిన బంగారునాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.