వికారాబాద్ జిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. పండుగ రోజు సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గుర్తించి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నలుగురిని మింగిన ఈత సరదా.. మునిగిపోయి ఇద్దరు, కాపాడబోయి మరో ఇద్దరు - ప్రాజెక్టులో ఈతకు దిగి నలుగురు మృతి
15:59 January 16
కోట్‌పల్లి ప్రాజెక్టులో ఈతకు దిగి నలుగురు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ ఎంబీఏ చదువుతుండగా, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. జగదీశ్ వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. పండుగ సెలవు కావడంతో అందరూ కలిసి సరదాగా అనంతగిరి పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ సరదాగా గడిపాక దగ్గరలోనే ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అలా కాసేపు అటుఇటు తిరిగాక ఈత కొడుదామని ఇద్దరు ప్రాజెక్టులోకి దిగారు. ఒడ్డు చివరనే వారు ఈదుతుండగా కొంచెం ముందుకు వెళ్లగానే లోతు ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ మునిగిపోయారు. గమనించిన మరో ఇద్దరు వారిని రక్షించడానికి వెళ్లి దురదృష్టవశాత్తు వారూ నీటిలో మునిగి మృతి చెందారు.
పండుగ పూట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో, మన్నెగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరితగతిన నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుటుందని ఎమ్మెల్యే ఆనంద్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: